Friday, June 04, 2010

నేనూ, నా మొదటి కార్టూన్ కధ !




ఈ ఫొటొలొ ఉన్నది చిన్ననాటి మా కుటుంబం. అమ్మ,నాన్నగారితో నేను, అక్క సరోజిని,
చెల్లి కస్తూరి. ఇంకొకటి ఆంధ్ర వారపత్రికలో 1958 లో అచ్చయిన నా మొదటి కార్టూన్..
సంతకం యం.వీ.అప్పారావని ఉంటుంది.
నేను గీసిన మొదటి కార్టూన్ ఆ నాటి ప్రముఖ సచిత్ర వార పత్రిక " ఆంధ్ర వార పత్రికలో
1958 లో అచ్చయింది. తెలుగులో కార్టూనిస్టులకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన మొదటి పత్రిక
ఆంధ్ర పత్రిక అనే చెప్పాలి. బాపూ గారి కార్టూన్లు, జయదేవ్ గారి కార్టూన్లతో బాటు పులిచెర్ల,
బాబు ,సత్యమూర్తి లాంటి కార్టూనిస్టులను పాఠకులకు పరిచయం చేసింది ఆంధ్ర సచిత్ర వార
పత్రికే ! 1954 లొ దసరాకు పిల్లలకు చిత్రలేఖనం పై పోటీలను వయసుల వారీగా ఏర్పాటు
చేసినప్పుడు మా చెల్లితో బాటు నేనూ ఓ బొమ్మ గీసి పంపాను, కానీ మా చెల్లి గీసిన "నేనూ,
మా సంగీతం మాస్టారు" అన్న బొమ్మకు పది సంవత్సరాల వయసు పిల్లల కేటగిరీలో బహుమతి
వచ్చింది. తరువాత నాలుగేళ్ళకు " నిశ్శబ్దం’ అన్ననా బొమ్మ మొదటి సారిగా అచ్చయింది. ఆ
రోజుల్లో ఇప్పటిలా టీవీలు లేవు గదా ! కార్టూన్ల కధలు చదవాలంటే ప్రతి ఆదివారం వచ్చే
"సండే స్టాండర్డ్" ( ఇండియన్ ఎక్స్ ప్రెస్ డైలీ ఆదివారం ఆ పేరుతో వచ్చేది.) లో రంగుల్లో కామిక్స్
చదివే వాళ్ళం. మిక్కీమౌస్ లాంటి కార్టూన్ సినిమాలు చూడాలంటే రెగ్యులర్ ఇంగ్లీషు సినిమాల
ప్రదర్శించే ముందు ఓ పది నిముషాలు చూపించినప్పుడు చూడాల్సిందే. అందుకే ప్రతి ఆదివారం
ఆ కార్టూన్లను చూడటానికి నాన్న గారితో మార్నింగ్ షోలకు వెళ్ళేవాడిని. ఆదివారం "సండే స్టాండర్డ్"
లో ’బ్రింగింగ్ అప్ ఫాదర్’, ’లిటిల్ కింగ్’లాంటి కామిక్స్ వేసేవారు. అలానే ’ఇల్లస్ర్టేటెడ్ వీక్లీలో
"ఫాంటమ్" కోసం ఆతృతతో ఎదురుచూసే వాడిని. నాన్నగారు బ్రిటిష్ వార పత్రిక " టిట్ బిట్స్"
కొనే వారు. అందులో చాలా మంచి కార్టూన్లు , ముఖ్యంగా సైలెంట్ కార్టూన్లు ఉండేవి. ఆ పత్రికలో
అమ్మాయిల పిన్ అప్ బొమ్మలూ ఉండేవి. నాకు కార్టూన్లంటే ఇష్టం కాబట్టి , మా అమ్మగారు కోప్పడుతున్నా
నన్నా పత్రికనునాన్నగారు చూడనిచ్చేవారు. నాకు పుస్తకాలన్నా, పత్రికలన్నా, బొమ్మలు గీయటం అన్నా ఆసక్తి
కలగడానికి మా నాన్న గారే కారకులు. మా చిన్నప్పుడు " బాల" పత్రిక వచ్చేది. అందులో "లటుకు-
చిటుకు" అనే శిర్షిక ఉండెది. చందమామ, యువ పత్రికలో ముఖచిత్రాలు వేసిన శ్రీ వడ్డాది ఆ శీర్షికకు
టైటిల్ బొమ్మ వేసారు. లటుకు,చిటుకులనే ఇద్దరు అబ్బాయిలు తమాషాగా మాట్లాడె మాటలు బలే
గమ్మత్తుగా ఉండేవి. 1956 నవంబరు నుంచి 1957 ఏప్రియల్ వరకు ఆంధ్ర వార పత్రికలో శ్రి ముళ్లపూడి
బాపు గారి బొమ్మల్తో " బుడుగు-చిచ్చుల పిడుగు" వ్రాసేవారు. బుడుగుకు బాపు గారు వేసిన బొమ్మలు,
రమణ గారు బుడుగు అల్లరిని చెప్పిన తీరు నన్ను ఎంతో ఆకర్షించింది. అప్పటి నుంచే బాపు రమణ గార్ల
అబిమానిగా మారిపోయా. మద్రాసు వెళ్ళినప్పుడు తప్పక బాపు రమణ గార్ల దగ్గరకు తీసుకువెల్తాను అనే
వారు మా నాన్నగారు. మద్రాసులో మా నాన్నగారి చిన్ననాటి స్నేహితులు శ్రీ శ్రీనివాస శిరోమణి గారు,
జ్యొతిష్కులు పాతూరి వారు ఉండేవారు. అయినా భాపు రమణ గార్లను కలవడం కుదరనే లేదు. ఆ కోరిక
2005 లో తీరింది. అలానే నా అబిమాన కార్టూనిస్టులు శ్రీ జయదేవ్ బాబుగారిని, ఈనాడు శ్రీధర్ గారిని
కలవాలనే నా చిరకాల వాంచ తీరింది.

1 comment:

  1. సురేఖ గారూ, మీ చిన్ననాటి ఫొటో ... ఆంధ్ర వారపత్రికలో 1958 లో అచ్చయిన మీ మొదటి కార్టూన్...బావున్నాయండీ.

    ReplyDelete