Sunday, May 02, 2010

నవ్వాలీ నవ్వాలీ !! మీ నవ్వులు అందరికీ ఇవ్వాలీ !!



నవ్వాలీ నవ్వాలీ !! మీ నవ్వులు అందరికివ్వాలి !!!

ఈ రోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం ! అసలు కొందరు అసలు నవ్వినట్లు కనిపించరు.
ఉదాహరణగా చెప్పుకోవాలంటే "హాస్యబ్రహ్మ" భమిడిపాటి కామేశ్వరరావుగారి గురించే
చెప్పుకోవచ్చు. ఆయన చూడటానికి చాలా సీరియస్ గా అగుపించేవారు. కాని ఆయన
ఎన్నో హాస్యరచనలు చేశారు. రోడ్డు మీద ఎవరో అరటిపండు తొక్క మీద కాలేసి జారి
పడ్డారనుకోండి. అప్పుడూ నవ్వు రావచ్చునేమో కాని అది హాస్యమనిపించుకోదుగదా.
కొంతకాలంవరకు తెలుగు సినిమాల్లో ఓ కామేడియన్ మరో వ్యక్తిని కాలితో తన్నితే
అదీ హాస్యంగా చలామణి ఐపోయింది. ఇక ఇప్పుడు హాస్యమంటె బూతుకు పర్యాయ
పదమైపోయింది. ఒకనాటి మన తెలుగు సినిమాల్లొ రేలంగి తెరపై అగుపించగానే జనం
గొల్లున నవ్వే వాళ్ళు. ఇక హాస్య నటుల పాత్రలుకూడా కధలోని ముఖ్య పాత్రల్తో కలసి
సాగిపోయేవి. రేలంగి,రమణారెడ్డి పాత్రలకు ఉండే హాస్యగీతాలు కూడా సందేశాత్మ్కంగా
వుండేవి. ఇక్కడ మీరు "రాముడు-భీముడు" చిత్రం లో రేలంగిరిజలపై చిత్రీకరించిన
’సరదా సరదా సిగరెట్టు’ అన్న పాటను చూడండి. హాస్యానికి తోడు సిగరెట్ చేసే మంచీ
చెడులను కొసరాజుగారు అద్భుతంగా వ్రాసారు.
ప్రముఖుల చమత్కారాలు కూడా నవ్వును పుట్టిస్తాయనడానికి ఇవే మంచి
ఉదాహరణలు. శ్రి దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య ఓ సారి జట్కాలో వెలుతున్నారట. ముందు
వైపు బరువు చాలక జట్కా వాడు "కొంచెం పైకి రండి సార్" అని అంటే "ఇంతకాలానికి
నువ్వొక్కడీవి కనిపించావురా ఆంధ్రదేశంలో తోటి ఆంధృణ్ణి పైకి రమ్మన్నవాడివి" అంటూ
మెచ్చుకొన్నారు !. భమిడిపాటి కామేశ్వరరావుగారికికూడా తెలుగువాళ్ళపై ఇలాటి
అభిప్రాయమే వుండేది. ఆయన ఓ సంధర్భంలో "తెలుగువాడు దుర్యోధనుడి లాంటి వాడు.
దుర్యోధనుడు తనకేమీకావాలని అడగడు. ధర్మరాజుకి మాత్రం ఏమీ ఉండకూడదని కోరు
కుంటాడు" అని అన్నారు.
మీకు కొన్ని నవ్వుల చిట్కాలు!
ఉదయాన్నే లేచాక మంచి జోకులు పుస్తకం చదవండి. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.
మీకు తెలిసిన జోకులను ఇతరులతో పంచుకోండి. మీరూ మీ ఊళ్ళో "హాసం క్లబ్" ప్రారంభించండి.
నెలలో మూడో ఆదివారం ఏర్పాటు చేయండి. మీకు ఎందరో కొత్త కొత్త హాస్య ప్రియులు పరిచయ
మవుతారు. మీకు పత్రికల్లో బాగానచ్చిన కార్టూన్లను కత్తిరించి ఓ ఆల్బమ్ తయారు చేయండి.
అప్పుడప్పూడూ ఆ పుస్తకం తిరగేస్తుంటే మనసు ఉత్సాహంగా వుంటుంది. ఇక ఈ నవ్వుల రోజుకు
సెలవు తీసుకుంటూ ఆఖరుగా ఓ చిన్న జోకు...
"ఏవిటోయ్, అప్పారావ్, సుబ్బారావు అంత మంచి జోక్ చెబితే మేమంతా నవ్వేంకదా, నువ్వు
నవ్వవేం?" అడిగారు మితృలు.
" వాడంటే నాకు వళ్ళు మంట ! ఇంటికి వెళ్ళి నవ్వుకుంటా" అన్నాడు అప్పారావు..

1 comment: