Friday, May 28, 2010

హాసానికి ముళ్లపూడి వారి ఆశీస్సులు

మా "హాసం క్లబ్" వార్షికోత్సవానికి శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారి శుభాకాంక్షలు
ఓ హాసం క్లబ్బూ !
పరిహాసాన్ని సుందర దరహాసంగా ఏమార్చి
నవ్వులు గుబాళించే హహహహ ! హమామ్ సబ్బూ !
ను - వ్వొస్తానంటే
న - వ్విస్తానంటే
నేనొద్దాంటానా !

ఆకూవక్కా సున్నంలాగే
జోకూ నేనూ నువ్వూ కలిస్తే
నవ్వుల తాంబూలం !
అది నే వద్దంటానా ?

కాని - ఐతే- నువ్వు మాత్రం హాయిగా నవ్వక పోయావో
భకరా ( అను భమిడిపాటి కామేశ్వరరావు గారు )
పబ్లిగ్గా పగలబడి నవ్వినంతొట్టు

ఆంధ్రుల్లో ఐకమత్యం కాలరెత్తుకున్నంత ఒట్టు
గిరీశం మధుర వాణికి తాళి కట్టినంత ఒట్టు
గంగా కావేరి నదులు
కాశీ రామేస్రాల్లో సరిగంగా స్తానాలు చేసినంత ఒట్టు
శివుడి తలమీద గంగ కూర్చుందని
గౌరి కంటనీరు పెడితే
శివ శివా! గంగ నా శిరసున కాదే !
నీ కళ్లలోనే తిరుగుతోందే చూస్కో
అని శివుడు నవ్వించి నవ్వినంత ఒట్టు
హాసం క్లబ్ ! హాపీబర్త్ డే ! !
---శ్రీ ముళ్లపూడి వెంకట రమణ (చెన్నై)

శ్రీ రమణ గారు నాపై ఎంతో ప్రేమతో , నే కోరిన వెంటనే మా "హాసం క్లబ్" ను
ఆశీర్వదిస్తూ వ్రాసి పంపారు. మీతో ఆ నవ్వుల దీవెనలను పంచుకోవాలనిపించింది.
అన్నట్టు ఈ రోజు నా పుట్టిన రోజు ( మే 28 ) సరిగ్గా ఓ నెల రోజుల తరువాత జూన్
28 న ముళ్లపూడి మా రాజమండ్రి ,ఆల్కాట్ గార్దెన్స్ లోని లూధరన్ హాస్పటల్లో
నవ్వుతూ, నవ్విస్తూ పుట్టారు !! అన్నట్టు మరచే పోయా. ఈ రోజుతో 70 లోకి
అడుగు పెడుతున్న నాకు మతిమరపు సహజమేగా ! ఈ రోజు మహానటుడు ,నటరత్న
యంటీఆర్ జయంతి.. తెలుగువాళ్ళ ఉనికిని దేశానికి చాటిన ఆ మహవ్యక్తి కి తెలుగు
జనాలందరి తరఫున జోహార్లు.


5 comments:

  1. జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  2. హాపీబర్త్ డే !

    ReplyDelete
  3. సురేఖ గారూ,

    మీకూ, మీ హాసం క్లబ్బుకీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మమ్మల్నందర్నీ నవ్విస్తూ మీరు ఎన్నో కార్టూన్లు గియ్యాలని, ఎన్నెన్నో బ్లాగు టపాలు వ్రాయాలనీ ఆకాంక్షిస్తూ...

    అబ్బులు

    ReplyDelete
  4. సురేఖ గారూ!

    తొలి 1970 లనించి నేను ‘నవ్వండి మరి!‘ అనే శీర్షికన సేకరించిన కార్టూన్లలో, మీవి కూడా రెండో, మూడో వున్నట్టు గుర్తు.

    హాస్యబంధువులు మీరు!

    బాపు రామాలయం పూజారిగా వుండదగ్గవాడేమోమరి! కానీ, రమణ ‘బుడుగు‘ మాత్రం, ‘హారి! పిడుగా!’ అనదగ్గవాడు! (అస్తమానూ హాచ్చెర్యపడి, లేచేస్తూంటాను నేను!)

    హాసం క్లబ్బు చెన్నై లోనే వుందా? వెబ్ సైట్ ప్రారంభించరూ?

    ReplyDelete