Thursday, February 10, 2011

మా ఊరి చరిత్ర





మా ఊరి పేరు రాజమహేంద్రవరం! అదే నండి ఆ పేరును పలకలేని ఆంగ్లేయులు
మా ఊరి పేరును రాజమండ్రి అనేశారు. అఖండ గోదావరిమాత తీరంలో వున్న
నగరం మా రాజమండ్రి..ఇప్పుడు ఈ నగరాన్ని తెలుగులో రాజమహేంద్రి అని
పిలుస్తున్నారు. వెయ్యేళ్ళ చరిత్ర గల పట్టణం రాజమండ్రి. గోదావరికి తూర్పున
వెలసింది. . తూర్పు చాణుక్యుల ఆధీనంలో ఈ నగరం వుండేదని చరిత్రకారులు
అంటారు. ప్రఖ్యాత చరిత్రకారుడు మెగస్తనీస్ పేర్కొన్నముఖ్య పట్టణాలలో
రాజమండ్రి కూడా వుంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యులు
దక్షిణ, పశ్చిమ ప్రాంతాలనుంచి శతృవుల దాడులు పెరగటంతో రాజధానిని
మార్చాలని భావించి, వేంగి, కళింగ సీమలకు మధ్య ఉన్న గోదావరి తీరంలోని
ఈ పట్టణం అనువుగా వుంటుందని తలచి విమలాదిత్యుని పెద్ద కొడుకు విష్ణు
వర్ధన రాజరాజు, రాజరాజనరేంద్రుడు ఈ పట్టణాన్నినిర్మించాడని చరిత్రకారులు
చెబుతారు. ఆదికవి నన్నయ మహాభారతాన్ని ఇక్కడే తెనిగించారు. ఆయన
రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి. ఆయన పేరిట ఇక్కడ నన్నయ విశ్వవిద్యాలయం
ఈ మధ్యనే స్థాపించారు. రాజరాజనరేంద్రుని తరువాత వచ్చిన తూర్పు చాళుక్య
రాజులు అంత:కలహాలతో సతమతమయ్యారు. ఈ అదును చూసుకొని మహమ్మద్
బీన్ తుగ్లక్ కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రున్ని ఓడించి పట్టణాన్ని తన స్వాధీనం
చేసుకొన్నాడు. అటుతరువాత రెడ్డిరాజుల పాలన వచ్చింది. వీరభద్రారెడ్డి కాలంలో
రాజమహేంద్రవరం అమరధామంగా విల్లసిల్లింది. ఈయన ఆస్థాన కవి కవిశౌర్యభౌమ
శ్రీనాధకవి.దక్షిణాదినుంచి విజయనగర చక్రవర్తులు, ఉత్తరం నుండి గజపతులూ
దండెత్తి రెడ్డిరాజుల పాలనకు చరమ గీతం పాడారు.1447 లో కటక రాజ్యధిపతి
కపిలేశ్వర గణపతి రాజమహేంద్రవ్రం దాని పరిసరాలపై దండెత్తి కళింగ రాజ్యాన్ని
దక్షిణ దిశగా విస్తరించాడు. అటు తరువాత గజపతులకు విజయనగర చక్రవర్తులు
అడ్డుకొన్నారు.పురుషోత్తమ గజపతి విజయనగర రాజులను జయించడానికి
సాకరు బరిగి సుల్తాన్ సహాయాన్ని కోరి అందుకు ప్రతిగా రాజమండ్రి, కొండపల్లి
రాజ్యాలను ఇచ్చాడు.భమనీ రాజ్యపాలన విచ్చిన్నమైన తరువాత పురుషోత్తమ
గజపతి కుమారుడు ప్రతాపరుద్ర గజపతి రాజమండ్రి పై దాడి చేసి మహమ్మదీయులను
తరిమికొట్టాడు.శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతాపరుద్ర గజపతి కుమార్తె చిన్నాదేవిని
వివాహం చేసుకొన్నాడు. శ్రీ కృష్ణదేవరాయలు తన మామగారికి రాజమహేంద్రవరం
వరకుగల రాజ్యాన్ని ఇచ్చి విజయనగరం వెళ్ళాడు. అటు తరువాత గజపతులకు
కుతుబ్షాకు యుద్ధాలు జరిగాయి ఏన్నో యుద్ధాలు తిరుగుబాటులు జరిగాక
ఫ్రెంచి సేనానాయకుడు బుస్సీ రాజమహేంద్రవరాన్ని ముఖ్యపట్ట్ణంగా చేసుకొని
పాలించాడు 1758లో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రెంచివారు ఓడారు.
బ్రిటిష్ సేనాపతి కల్నల్ ఫోర్ట్ రాజమండ్రిని స్వాధీనం చేసుకొన్నాడు బరంపురం నుంచి
రామేశ్వరం వరకు విస్తరించిన మద్రాసు ప్రెసిడెన్సీలో రాజమహేంద్రవరం ఒక ముఖ్య
కేంద్రంగా వుండేది.ఆనాటి నుంచి ఈనాటి వరకు సాంస్కృతీ కేంద్రంగా, వాణిజ్య కేంద్రంగా
పేరుపొందింది. ఈనాడు రాజధాని నగరం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పట్టణాలలో
ఉన్న బొమ్మన, చందన వస్త్రనిలయాల పుట్టిల్లు రాజమండ్రే ! ప్రశిద్ధ చిత్రకారుడు
దామెర్ల రామారావు ఈ ఊరి వాడే. ఆయన పేరుతో ఇక్కడ దామెర్ల ఆర్ట్ గేలరీ వుంది.
ఎందరో రీసెర్చ్ స్కాలర్స్ ఉపయొగపడుతున్న గౌతమీ గ్రంధాలయం ఇక్కడ వుంది.
సినీ రంగానికి చెందిన ప్రముఖులలో ఆదుర్తి, రాజబాబు, గరికిపాటి రాజారావు
ఇక్కడి వారే. వహిదారహ్మాన్, షావుకారు జానకి, కృష్ణకుమారి వారి తండ్రుల ఉద్యోగరిత్యా
ఇక్కడే వాళ్ళ బాల్యాన్ని కొంతకాలం గడిపారు. ఆనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు
ఇక్కడ, పరిసర ప్రాంతాలలో షూటింగులు జరుపుకున్నాయి, జరుపుకుంటున్నాయి.
ఆసియాలోనే పొడవైన రోడ్డు కమ్ రైలు వంతెన ఇక్కడ వుంది. విమానయాన సౌకర్యానికి
ఎయిర్పోర్ట్ వుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇక్కడి ఆర్ట్స్ కళాశాలలో పనిచేశారు. ఇక్కడికి
దగ్గరలోనే వున్న కడియంలో నర్సరీ గార్డెన్స్ వున్నాయి. రాజమండ్రి దగ్గరలో ఎన్నో
దేవాళయాలున్నాయి. ఇక్కడినుంచి పాపికొండలు విహారానికి ఆధునిక సౌకర్యాలతో
మోటార్ బోట్స్ పై ప్రతి రోజూ వెళ్ళవచ్చు. రాజమండ్రి లోని రాళ్ళబండి మ్యూజియంలో
ఎన్నో చారిత్రాత్మక శిల్పాలను చూడవచ్చు. సమీపంలోనే గల కోనసీమలో బారులుతీరిన
కొబ్బరిచెట్లు, గోదావరి కాలువలు కేరళ తీరాన్ని మరపిస్తాయి, ఆ పకృతి అందాలు .
మురిపిస్తాయి.ఆంధ్రకేశరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజమండ్రి మునిసిపల్
చైర్మన్ గా పనిచేశారు. హాస్య రచయిత భమిడిపాటి కామేశ్వరరావు, ఆయన కుమారులు
హాస్యనాటక, సినీరచయిత భమిడిపాటి రాధాకృష్ణ ఈ నగరానికి చెందినవారు. సంఘసంస్కర్త
కందుకూరి వీరేశలిగం, రచయిత శ్రీపాద ,సుబ్రహ్మణ్య శాస్రి ,కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
(ఆస్థాన కవి) నడయాదిన పవిత్ర ప్రదేశం రాజమండ్రి 1866 మునిసిపాలిటిగా ఏర్పడి
25-3-1995లో కార్పొరేషన్గా ఏర్పడింది. కాశీమజలీ కధలు (రచయిత మధిర సుబ్బన్న
దీక్షితులు) ఇక్కడే పుట్టాయి. ఆంధ్ర కేశరి టంగుటూరి ప్రకాశం (మాజీ ముఖ్యమంత్రి)
రాజమండ్రి మునిసిపల హై స్కూల్లో చదువుకున్నారు. బుడుగు ముళ్లపూడి వెంకట
రమణగారు 1931 జూన్ 28 న ఇక్కడే ఆల్కాట్ గార్డెన్స్ లోని లూధరన్ మిషన్ హాస్పటల్లో
(లేడిస్ హాస్పటల్) పుట్టారు.
వేదంలా ఘోషించే గోదావరి

వేదంలా ఘోషించే గోదావరి- అమర
ధామంగా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం
అన్నారు ఆరుద్ర
నేను అక్కడఅక్కడ, చదివినవి , చెప్పగా విన్నవి ఆధారంగా వ్రాశాను, తప్పులుంటే
మన్నించండి. .

3 comments:

  1. రాజమండ్రికి ఉన్న ఠీవి, రాజసం మరే ఊరికి రావండి. అవ్వడానికి ప.గో.జి.వాణ్ణయినా, రాజమండ్రి అంటే నాకు చాలా ఇష్టం. మీ బ్లాగులు చదువుతుంటే ఏదో "Encyclopedia" చదివినట్లుగా ఉంటుంది. చక్కటి అంశాలు ఎంచుకుని పాఠకులను రంజింపజేస్తున్నందుకు నా అభినందనలు,
    కృతజ్ఞతలు.

    భవదీయుడు,
    వర్మ (ఉరఫ్ అబ్బులు)

    ReplyDelete
  2. నేను ఇంతవరకు రాజమండ్రిని చూడలేదు. చూడాలనే కోరిక మాత్రం ఉంది.
    నేను వరంగల్ వాణ్ణి అయినా "వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోబిల్లే రాజమహేంద్రి" పాట విని పులకించిపోతాను. ఆ పాటంటే నాకంత ఇష్టం. ఇదే కాదు, "ననుగన్న నా తల్లి రాయలసీమ" పాటకూడా ఇష్టం. కాని "ఇదే చంద్రగిరి, శౌర్యానికి గీచిన గిరి" పాట ఎందుకో నచ్చదు. అంతేకాదు, "ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము, మూడుకోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం" పాట కూడా అంతగా నచ్చలేదు.

    ReplyDelete
  3. శ్రీ కంది శంకరయ్య గారికి ధన్యవాదాలు.
    అభిప్రాయం తెలియజేసిన ఇతర మితృలకు
    శుభాభినందనలు.

    ReplyDelete