Saturday, July 02, 2011

ఈ కాలం పిల్లలు

మొన్న ముఫైవతేదీన మితృడు దినవహి వి.హనుమంతరావు అద్యక్షుడిగా
ఉన్నభారత్ వికాస్ పరిషత్, వివేకానంద శాఖ (రాజమండ్రి)వారు బాలవికాస శిబిరం
స్థానిక మహావీర్ విద్యానికేతన్ లో ఏర్పాటు చేస్తూ , ఎనిమిది, తొమ్మిది తరగతి
విద్యార్ధులకు కార్టూన్ల గురించి చెప్పమన్నారు. నాకు ఇష్టమైన విషయం కాబట్టి
సంతోషంగా వెళ్ళాను. అక్కడి ఆడ మగ పిల్లల క్రమశిక్షణ చూడగానే ముచ్చట
వేసింది. పెద్దలపై వాళ్ళు చూపించిన గౌరవం అది నేర్పిన ఆ స్కూలు బొధనా
సిబ్బంది కృషిని మెచ్చుకోకుండా వుండలేకపోయాను. ఇక అసలు విషయానికి
వస్తాను. మంచి బొమ్మలు, నవ్వించే కార్టూన్లు గీసే బాపుగారు తెలుసా అంటే
తెలియదన్నారు. "బుడుగు" అనే పుస్తకం చదివారా, చూశారా అంటే తెలియదన్నారు.
ఆకాలం పుస్తకమైనా ఈకాలంలోనూ "బుడుగు" దొరుకుతున్నది కదా?!నా మనస్సు
చివుక్కుమంది.


ఈ పిల్లలంతా చదువులో చాలా చురుగ్గా వున్నారు. ఆ సభకే వచ్చిన ఫిజిక్స్
లెక్చరర్ శ్రీ చాగంటి శరత్ కుమార్ గారు లైట్, సౌండు గురించి, మన మాటతీరును
బట్టి ఎదుటవారి ప్రవర్తన ఎలా వుంటుందో చిన్న కధలద్వారా చెప్పినప్పుడు అటు
తరువాత వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు బహు చక్కగా
జవాబులు చెప్పారు. అంటే లోపం ఎక్కడ వుంది. వాళ్ళకు చదువుతో బాటు,తెలుగు
సాహిత్యం గురించి, మన తెలుగువారిలో వున్న బాపులాటి ప్రముఖ చిత్రకారుల
గురించి అవగాహన కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన కూడా వుంది. దీనికి
కారణం ఈ కాలం తల్లిదండ్రులు చాలా బిజీ. వాళ్ళకే చాలా సంగతులు తెలియవు.
ఇక పిల్లలకేం చెబుతారు. తాతలు అమ్మమ్మలూ ఎక్కడో దూరంగా వుంటారు,
మరొకటి పిల్లలు తెలుగులో మాట్లాడినా, తెలుగు పుస్తకాలు చదివినా నామోషీగా
భావిస్తారు.
ఈ టీవీలో ప్రతి ఆదివారం పంచతంత్రం పప్పెట్ షో ప్రసారం చేసేముందు కర్టెన్ రైజరుగా
మన రాజధాని వీధుల్లో యువకులను పెద్దలను కలసి పంచతంత్రం అంటే
తెలుసా అని అడిగితే చలా మంది తెలియదన్నారు. మా రోజుల్లో పరవస్తు చిన్నయ
సూరి రచించిన పంచతంత్రం తెలుగు పాఠ్యాశ్యంగా వుండేది. బొమ్మల కధగా ఆంధ్ర
వారపత్రికలో శ్రీ విశ్వాత్ముల నరసింహమూర్తి, అటుతరువాత శ్రీ బాపు చిత్రాలతో
వచ్చేది. ఈప్పుడు కార్టూన్ చానళ్ళు వచ్చి హనుమంతుడిని ఇండియన్ సూపర్
మాన్ అని పిల్లలకు చెబుతున్నారు. ఇక విఘ్నేశ్వరుణ్ణి జీన్స్ పాంట్ తో చూపించే
దౌర్భాగ్యం వచ్చింది. ఇలాటివి చిన్నారి మనసులపై ఎలాటి ముద్రను వేస్తాయో మన
పెద్దలు ఆలోచించాలి. పిల్లలకు హారీపాటర్ లాంటి ఇంగ్లీషు కధలతో బాటు మన
సాహిత్యంలోని కాశీమజిలీ కధలు, భట్టివిక్రమార్కుడి కధలు చదివించాలి,చెప్పాలి
మనం ఒకరి ఇంటికి పిల్లల్తో వెళ్ళి నప్పుడు ఎలా వుండాలో నేర్పాలి. పుస్తకాలను,
వస్తువులను ముట్టుకోకూడదనీ, చూడాలంటే అడిగి చూడాలనీ చెప్పాలి. పిల్లలు
ఏ విలువైన గాజు బొమ్మనో తీస్తుంటే వాళ్ళ తల్లులు ఏమనుకుంటారో అని మొహ
మాట పడుతుంటారు. ఈ విషయంలో తలకు బాగా బొప్పెలు కట్టించుకున్న నేను
మాత్రం నిర్మొహమాటంగా తియ్యకు బాబూ అని చెబితే అది తప్పని పిల్లలకు చెప్పక
బోగా వాళ్ళే కోపగించుకుంటారు. పిల్లలకు మనం చెప్పే, నేర్పే రీతిని బట్టి వాళ్ళలో
మార్పు వస్తుంది. మన భాషపై మనమే చులకనగా వాళ్ళ ఎదుట మాట్లాడితే అది
పిల్లల మనసుపై ప్రభావం తప్పక చూపిస్తుంది. మన తెలుగులో వున్న సాహిత్యం
గురించి, హాస్యం గురించి రచయితలు, చిత్రకారుల గురించి చదువుతో సమానంగా
చెప్పాలి. మనమూ ఇంగ్లీషుతో బాటు మంచి తెలుగు సాహిత్యం చదవటం అలవాటు
చేసుకోవాలి.
"కదలకుండా కూర్చొని చూసే టెలివిజన్
కన్నా మంచి పుస్తకం నీకిస్తుంది "తెలి"విజన్ !!"
( నా సురేఖార్ట్యూన్స్ నుంచి)
ఇక్కడి కార్టూన్ బాపు స్వాతి కార్టూన్స్ సౌజన్యంతో, లెక్కల మాస్టారు కార్టూన్ నేను
1960 లో ఆంధ్రవార పత్రికలో వేసినది.మిగతావి ఇటీవలవి.

No comments:

Post a Comment