Saturday, July 09, 2011

కామిక్కులకు, మాజిక్కులకు రెడీ అనే రమణారెడ్డి !

నెల్లూరులో శానిటరీ ఇన్స్పెక్టరుగా ఉద్యోగం చేసిన తిక్కవరపు రమణారెడ్డి
1951 లో సినిమారంగ ప్రవేశం చేశారు. సన్నగా పొడుగ్గా పొడుగుపాటి
కర్రల మీద నడుస్తున్నాడా అనే టట్లు వుండే ఈ రమణారెడ్డి సంభాషణలలో
నెల్లూరి యాసను జోడించి సంభాషణలు చెబుతూహాస్యనటుడిగా ప్రేక్షకుల
అబిమానాన్ని పొందారు. సన్నగా వుండే వాళ్ళను రమణారెడ్డితో జనాలు
పోల్చేవారు,.
ఇల్లరికం సినిమాలో మామా అళ్ళుల్లగా రమణారెడ్డి నటన మరచిపోలేము.
పల్లెటూరు,రోజులు మారాయి,సువర్ణసుందరి,మిస్సమ్మ,మాయాబజార్,
వరుడుకావాలి, అత్తా ఒకింటి కోడలే, అంతస్తులు, ఆరాధన, రాముడు భీముడు
గుండమ్మ కధ,సత్య హరిశ్చంద్ర ఇలా ఎన్నేన్నో చిత్రాలలో తన అఫూర్వ హాస్య
నటనతో కొన్ని చోట్ల విలనీ ప్రదర్శించి ప్రేక్షకుల గుండెల్లో నిలచిపోయారు.
ఆయన మిస్సమ్మ చిత్రంలో పోషించిన డేవిడ్ పాత్రలో వంకర్లు తిరుగుతూ
సావిత్రిని పెళ్ళిచేసుకోవాలనుకొనే పాత్ర ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది.
మన పౌరాణిక చిత్రాలలో నాగేశ్వరరావు, రేలంగి ,కాంతారావు మొ"వాళ్ళు
నారద పాత్ర ధరించారు. 1960 ప్రాంతాలలో వచ్చిన "రేణుకాదేవి మహాత్మ్యం"
లో ఆయన ధరించిన నారద పాత్రకు ఓ ప్రత్యేకత వుంది. ఇందులో అయన
లాల్చి లాటి దుస్తులు వేసుకుంటాడు ! మరీ బక్కగా వున్న ఆయన చొక్కా
విప్పితే బొమికలు దర్శనమిస్తాయి. అందుకే అలా పై చొక్కాతో ఆ చిత్రంలో
అగుపిస్తారు. రమణారెడ్డి సౌమ్యుడు. ఆయన సీరియస్ గా వుంటూ, నవ్వించే
వారట. ఓ చిత్రంలో మ్యాజీష్యన్ పాత్ర ధరిస్తూ మ్యాజిక్ నేర్చుకొని ప్రదర్శనలు
ఇచ్చే స్థాయికి ఎదిగారు. పంచె కట్టి అందులో ఇన్షర్టు చేసి పైన ఓ బెల్టు పెట్టు
కొన్న ఆయన వేషధారణ చూడగానే నవ్వు తెప్పించేది. లివరు వ్యాధితో
అస్వస్థులై అస్తమించారు. ఈ నాడు తెలుగుతెరపై హాస్యం అపహాస్యమై వెగటు
పుట్టిస్తుంటే రమణారెడ్డిగారి లాంటి మహానుభావుల హాస్య నటనను ఆనాటి
చిత్రాలను చూస్తూ మరో సారి గత రోజుల వైభవాన్ని తలచుకొని మురిసిఫోవడం
కన్న మనమింకేం చేయగలం ?!
( చిత్రాలు బాపు కార్ట్యూనులు, బాపు సోదరులు S.శంకరనారాయణ పెన్సిల్ స్కెచ్
సౌజన్యంతో)

3 comments:

  1. రమణారెడ్డి గారి గురించి వ్రాసినందుకు థాంక్స్.

    ReplyDelete
  2. నా అభిమాన హాస్య జంట రేలంగి, రమణారెడ్డి. గొప్ప హాస్య నటులు, మాయాబజారు మరిచినట్టున్నారు. కంబళి-గింబళి, తల్పం-గిల్పం సృష్టించింది ఆయనే :))

    ReplyDelete
  3. రమణారెడ్డి గారి గురించి వ్రాసినందుకు many many థాంక్స్.

    ReplyDelete