Thursday, September 15, 2011

కారెక్టర్ నటులు-శ్రీ యు.సుబ్బరాయశర్మ

యమలీల చిత్రంలోని వీడియో క్లిప్పింగ్ చూశారుగా ! ఇందులో మెంటల్ డాక్టరుగా
నటించిన శ్రీ యుప్పలూరి సుబ్బరాయశర్మ జన్మ స్థలం విజయవాడ. అక్కడే ఎస్.
ఆర్.ఆర్. కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్ రోడ్డూ రవాణాసంస్థలో 1971లో
ఉద్యోగంలో చేరారు. కాలేజీ రోజుల్లోనే నటనపై ఆసక్తితో "ఆడది" ,"అంతా ఇంతే" ,
"కీర్తిశేషులు" "వాంటెడ్ ఫాదర్స్" మొదలైన నాటికల్లో నటించారు. ప్రఖ్యత హాస్య
రచయిత, దర్శకులు శ్రీ జంధ్యాల సహవాసంతో ఆయన రచించిన "జీవనజ్యోతి",
" ఏక్ దిన్ కా సుల్తాన్ ", "లేత గులాబి", " గుండెలు మార్చబడును" మొదలైన
నాటికల్లో పాల్గొన్నారు. ఉద్యోగ రిత్యా హైదరాబాదుకు బదలీ అయ్యాక దూరదర్శన్
ప్రచారకార్యక్రమాల్లో నటుడిగా అడుగు పెట్టారు. " కుక్క" చిత్రంతో నటుడిగా సినీ
రంగ ప్రవేశం చేసి దాదాపు 250 చిత్రాలకు పైగా నటించారు. "శుభలగ్నం" చిత్రం
లో మహా నటుడు శ్రీ గుమ్మడి వేంకటేశ్వరరావు ప్రక్కన నటించే అవకాశం రావటం
తన అదృష్టం అంటారు శ్రీ సుబ్బరాయశర్మ.
ఎన్నో సంవత్సరాల నాటకానుభవంగల శ్రీ శర్మ అనేక పురస్కారాలను పొందారు.
చెన్నై కళాసాగర్ నుండి మూడు సార్లు ఉత్తమ నటుడు అవార్డు పొందారు. నాగపూర్
తెలుగు సమితి నుండి ఉత్తమ నటుడు, హైదరాబాదు ఆరాధన సాంస్కృతిక సంస్థచే
"కళాకౌశల" బిరుదు, తెలుగు నాటకదినోత్సవ సంధర్భంగా 2010 సం" లో రంగస్థల
పురస్కారం అందుకున్నారు. ఆకాశవాణి నాటకశాఖలో 30 ఏళ్ళు శ్రీమతి శారదా
శ్రీనివాసన్, శ్రీమతి శ్యామలాదేవి, శ్రీ రత్నప్రసాద్, శ్రీ నండూరి మురళీకృష్ణలతో పని
చేశారు. ఎన్నో టీవీ ధారావహికలలో ఆయన నటనకు అనేక సంస్థల నుండి
బహుమతులు అందుకున్నారు. " జానకీ గోపాలం " టెలీఫిల్మ్, "భక్తవిజయం " 13
ఎపిసోడ్స్ ( SVBC) నిర్మాణ దర్శకత్వాలలో పాలు పంచుకున్నారు. "స్వయంవరం"
"మరో వసంతం" ధారావహికలకు ఉత్తమ సహాయక నటుడిగా నంది బహుమతులను
అందుకున్నారు. ఈటీవీ నిర్మించిన "శ్రీ భాగవతం" లో దూర్వాసునిగా శ్రీ బాపుగారి
దర్శకత్వంలో నటించారు. శ్రీ బాపు దర్శకత్వంలో అతిత్వరలో రాబోతున్న శ్రీరామ
రాజ్యం లో ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. హాస్య పాత్రయినా, గంభీరమైన పాత్రయినా
అవలీలగా నటించగల ప్రతిభావంతులు శ్రీ సుబ్బరాయశర్మ.కె.రాఘవేంద్రరావు, జంధ్యాల,
సింగీతమ్ శ్రీనివాసరావు, ఎస్వీ.కృష్ణారెడ్డి,కోడి రామకృష్ణ,బాపు, సురేష్ కృష్ణ,బోయిన
సుబ్బారావు, రాజమౌలి మొదలయిన ప్రముఖ దర్శకులందరి దగ్గరా ఆయన నటించారు.

గత ఏప్రియల్లో మా కోడలు ఇంట్లో జరిగిన ఉపనయానికి మేము హైద్రాబాదు వెళ్ళి
నప్పుడు శ్రీ శర్మ ( మా కోడలికి ఆయన ఆత్మీయ బంధువు) నన్ను, నా శ్రీమతిని
వారింటికి పిలిచారు. శ్రీ శర్మ, వారి శ్రీమతి మాపై చూపించిన అభిమానం, ఆప్యాయత
మరువలేనివి.

1 comment:

  1. సుబ్బరాయశర్మగారి కజిన్ ఆత్రేయశర్మ,నేనూ బ్యాంక్ డ్రామాల్లో వేసేవాళ్ళం .. ఆ డ్రామాలు చూసాక...శ్రీ సుబ్బరాయ శర్మగారు నా దగ్గరకి వచ్చి నా నటనను మెచ్చుకుంటూ ప్రత్యేకంగా అభినందించేవారు.. అప్పుడు ఆయన సంతోష్ నగర్ లో ఉండేవారు...నన్ను ఓ సారి వారింటికి రమ్మనమని ఆత్రేయశర్మ ద్వారా కబురుపంపించి...నన్ను వారితో్పాటు పరిషత్ డ్రామాల్లో చేయమని అడిగారు. దురదృష్టవశాత్తూ అది కుదరలేదు ..నేను హైదరాబాదులో ఉన్నప్పుడు ఆయన పనిచేస్తున్న సంస్థ ఆర్.టి.సి తరఫున వ్యాపార ప్రకటనల్లో రేడియోల్లో వీరు నటించిన చిన్నచిన్న నాటికల్లాంటివి వచ్చేవి..అవి చాల బాగుండేవి...మా ఇంటిల్లపాతీ అవి విని ఆనందించడం అప్పట్లో ఓ ముచ్చట.
    మీ అబ్బాయి పెళ్ళి హైదారాబాదులో జరిగినప్పుడు పెళ్ళికివచ్చిన శ్రీశర్మగార్ని నేను కలిసాను. ఎంతో అభిమానంగా చాలాసేపు మాట్లాడారు. మంచి ఈజ్ ఉన్న నటులు...అన్ని రకాల పాత్రలు పాత్రోచితంగా నటించగల సామర్థ్యంఉన్న అతి కొద్దిపాటి నటుల్లో శ్రీ సుబ్బరాయశర్మగారు ఒకరు...ఓ మంచి నటుణ్ణి, ఓ మంచి వ్యక్తిని పరిచయంచేసిన మీరు అభినందనీయులు...

    ReplyDelete