Saturday, September 24, 2011

"విజయ"కేతనమెగరేసిన "చందమామ"య్య చక్రపాణి

తెనాలి ఐతానగరంలో 1908 ఆగష్ట్ 5వ తేదీన వెంకట సుబ్బారావనే
చక్రపాణి జన్మించారు. ఆయన ఇంటి దగ్గరే వున్న ప్రాధమిక పాఠశాలలో
ఐదో తరగతి పూర్తి చేసి, తెనాలి తాలూకా హైస్కూళ్ళో ఆరవ తరగతిలో
చేరి ఎస్.ఎస్.ఎల్.సి.వరకూ చదివారు. జాతీయోద్యమంలో చేరి ఉత్సాహంగా
పాల్గొన్నారు.

1934లో చక్రపాణిగారికి టిబీ సోకింది. మదనపల్లి శానిటోరియంలో 1935
లో చికిత్సకై చేరిన ఆయనకు ఓ బెంగాలీ వ్యక్తితో పరిచయమవటమే
కాకుండా ఆయన దగ్గర బెంగాలీ నేర్చుకున్నారు. కలకత్తా నుంచి వాచకాలు,
పిల్లల కధలు తెప్పించి చక్రపాణికి కానుకగా ఇచ్చారు. తన అపార గ్రహణశక్తితొ
బెంగాలీ భాషను నేర్చుకొనడమే కాక ప్రఖ్యాత శరత్ నవలలను అవి తెలుగులో
శరత్ బాబే వ్రాశాడా అన్నంతగా ఆయన అనువాదం సాగింది. చక్రపాణి శత
జయంతి సంధర్భంలో ఆయన వ్రాసిన శరత్ సాహిత్యం దేవదాసుతో బాటు
మరో ఐదు నవలను ఒకే పుస్తకంగా డాక్టర్ వెలగా వెంకటప్పయ్య సేకరణగా
వెలువడింది.
నాగిరెడ్డిగారితో పరిచయం అటుతరువాత వారిద్దరి స్నేహం దినదిన
ప్రవర్ధమానమయింది. నాగిరెడ్డిగారు మద్రాసులో బియన్ కే ప్రెస్ ప్రారంబించాక
అందులో చక్రపాణిగారి పుస్తకాలు అచ్చువేసేవారు ఇద్దరూ కలసి సినిమాలు,
తీశారు. "చందమామ" లాంటి పిల్లల బొమ్మల పత్రికను పలు భాషలలో
ప్రారంభించారు. విజయా సంస్థను స్థాపించి "షావుకారు", "పెళ్ళిచేసి చూడు",
"పాతాళభైరవి", "మిస్సమ్మ"," గుండమ్మకధ", "మాయాబజార్" లాంటి ఆణిముత్యాలను
తెలుగుతెరకు అందించారు ఆయన ముక్కుసూటిగా మాట్లాడేవారు. శ్రీ ముళ్ళపూడి
వెంకటరమణగారు ఆంధ్రపత్రికలో పని చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూ కోసం వెళ్ళి
"నేను ఆంధ్రపత్రిక నుంచి వచ్చానండి" అన్నారు
"ఎందుకూ"
"మీతో ఇన్టర్వ్యూ చేసి"
"ఎందుకూ"
"మీ గురించి వ్రాద్దామని"
"నా గురించి చెప్పడానికి ఏముంది..నువ్వు రాయడానికేముంది.నేను నేనే"
"అంతేనా"
"అంతేగదా". కుండ బద్దలు కొట్టినట్లు సమాధానాలు చెప్పడం చక్రపాణిగారికే
సాధ్యం. ముళ్ళపూడి చక్రపాణి గురించి ఇలా అన్నారు. "వేప రసం,హ్యూమరసం
కలిసి కళాత్మక వ్యాపారి వెరసి చక్రపాణి"
ఆంధ్రజ్యోతి మాస పత్రికను స్థాపించి అందులో "పనిలేని మంగళి" శీర్షికలో వివిద
విషయాలపై ఎన్నో వ్యాసాలను వ్రాశారు. హైద్రాబాదులో "యువ" మాసపత్రికను
నడిపారు. "కినిమా" మాసపత్రికను నాగిరెడ్డిగారితో స్థాపించి కొంతకాలం నడిపారు.
సినిమా, పుస్తక పత్రికా రంగాలలో ఎనలేని సేవలందించిన చక్రపాణిగారు ఇదే
రోజు ( 24-09-1975) చెన్నై విజయా హాస్పటల్లో మరణించారు .సినీ సాహిత్య
లోకంలో చందమామలా వెలిగిన శ్రీ చక్రపాణిగారికి జోహార్లు. .

2 comments:

  1. శ్రీ అప్పారావు గారూ,
    ఈ రోజు విశేషానికి తగినట్లుగా సకాలంలో మంచి వ్యాసం ప్రచురించారు. ధన్యవాదాలు. చక్రపాణీయం, దేవదాసు, పల్లీయులు అనే పుస్తకాలు, 2008లో మళ్లీ వెంకటప్పయ్య గారి ఆధ్వర్యంలో ప్రచురించిన చందమమ విజయపతాక (?) పుస్తకం కూడా నావద్ద ఉన్నాయి. చక్రపాణీయం పుస్తకం తెలుగు డేటా బ్రహ్మ శ్రీ శ్యామ్ నారాయణ్ గారి పుణ్యమా అని చక్రపాణీయం పీడీఎప్ కాపీ మాత్రమే పొందగలిగాను.
    కాని మీరు ఇక్కడ ప్రచురించిన శ్రీ వెలగా వెంకటప్పయ్య గారు రాసిన చక్రపాణి పుస్తకం చూడలేదు చూస్తుంటే అది పాత పుస్తకం లాగా ఉంది. ఇది ఇప్పుడు బయట ఎక్కడైనా దొరికే అవకాశం ఉందా" బయట దొరికితే తీసుకోవాలనుకుంటున్నాను.
    పాత పుస్తకం ఇవ్వను, కొత్త పుస్తకం కూడా ఇవ్వను ఎందుకంటే అంటూ మీరు ఈమధ్య కూడా పేర్కొన్నారు కాబట్టి మీ పుస్తకం ఇవ్వమంటూ అడగటానికి సాహసించను. కానీ ఈ పుస్తకం కూడా దొరికితే నా వద్ద పూర్తి కలెక్షన్ ఉంటుందని ఆశ

    చందమామను చిరస్మరణీయంగా తీర్చిదిద్దిన మాన్యుడి గురించి మళ్లీ గుర్తు చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

    ReplyDelete
  2. రాజు గారూ,
    చక్రపాణీయం వెలగా గారు వేసింది నా దగ్గరుంది. నాకు దొరికి కూడా నాలుగైదేళ్ళవుతోంది. కోఠీలో నీల్ కమల్ లో దొరికింది, వేరే పుస్తకం కోసం వెదుకుతుంటే! ఇక్కడ ప్రచురించిన చక్ర్పాణి పుస్తకం మాత్రం లేదు.ఎప్పుడు వేశారో తెలీదు.

    ReplyDelete