Tuesday, November 15, 2011

చర్మాన్నీ మార్చేయొచ్చు !!



ఈ నెల నాలుగవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పై శీర్షికతో ఒక వార్త వచ్చింది.
ఇదేదో ఫేస్ క్రీముల ప్రకటనలా వుందే అని అనుకుంటూనే చదివాను. చాలా
సంతోషం కలిగింది. ఆ వార్తలో "ఉత్తర అమెరికాలో స్థిరపడిన ప్రముఖ ప్లాస్టిక్
సర్జన్ డాక్టర్ హనుమదాస్ మారెళ్ల దీనికి రూప కల్పన చేశారు" అని వుంది.
ఈ ఏడాదే డాక్టర్ దాసు పిల్లల కాలిన గాయాల చికిత్స పై వ్రాసిన పుస్తకం
చెన్నైలో అవిష్కరించారు. ఆనాటి సభలో మా దాసుబావ ఫొటో.
ఈ ఫొటోలో ఎడమవైపు కూర్చున్నది దాసు, కుడి ప్రక్కన నేను ! దాసు మా
మేనమామ గారి అబ్బాయి. చిన్ననాటి నుంచి మాకు స్కూలు సెలవలివ్వగానే
గుంటూరు వెళ్ళే వాళ్ళం. మా మావయ్య గుంటూరు దగ్గర తాడికొండ లో
ఐ ఎల్ టీ డీ లో ఉన్నతోద్యోగం చేసే వారు. కంపెనీ పెద్ద బంగళా ఇచ్చారు.
మేమిద్దరం కొబ్బరి చీపురు పుల్లలతో పెద్ద పెద్ద గదుల్లో కత్తి యుద్ధాలు
చేసే వాళ్ళం. అట్టపెట్టెకు భూతద్దం పెట్టి ఎత్తుగావుండే వెంటిలేటర్సు నుంచి
వచ్చే ఎండకు అద్దంపెట్టి మరోవైపు ఫిల్మ్ పెట్టి సినిమా ఆటలు ఆడుకొనే
వాళ్ళం. ఇంకొంచెం పెద్దయ్యాక మాకు సినిమా ప్రొజెక్టర్ కొనుక్కోవాలనే
తీరని కోరిక వుండేది. పత్రికల్లో సినిమా ప్రొజెక్టర్ల ప్రకటనలు చూసి సంబర
పడేవాళ్ళం.ఎలా ఐనా తెప్పించుకోవాలనుకొనే వాళ్లం !!


ఈ ఫొటో గుంటూరు అరండల్పేట లోని మా మావయ్య ఇల్లు "ప్రభాతనిలయం"
లో తీసింది. అప్పుడు దాసు గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు.
మెడికోగా ఆనాటి ఫొటో.ఇప్పుడు ఆ ప్రభాత నిలయం బిల్డింగ్ పెద్ద షాపింగ్
కాంప్లెక్స్ గా మారిందట!

గత జనవరిలో డా"దాసు, తన శ్రీమతి డా"పంకజతో రాజమండ్రి మా ఇంటికి
వచ్చినప్పటి ఫొటో. డా"పంకజ మా దాసుకు గుంటూరు మెడికల్ కాలేజీలో
సహాధ్యాయిని. చిన్ననాటి మా ఆటలు, అల్లర్లు, సినిమా ప్రొజెక్టర్ కోసం మేం
పడిన ఆరాటం తలచుకొని ఆనందించాం. తను చదివిన గుంటూరు నగరంలో
అత్యాధునిక తొలి హ్యూమన్ స్కిన్ మార్పిడి యూనిట్ కు రూపకల్పన చేసిన
మా దాసు బావకు మీ అందరి తరుఫున అభినందనలు తెలియజేస్తున్నాను.

2 comments:

  1. దాసు మావయ్య గురించి మీరు చెప్పిన చిన్ననాటి అనుభవాలు బాగున్నాయి.
    కృష్ణసాయి, ముంబాయి

    ReplyDelete
  2. డా. దాసు గారి గురించి రాసిన మీ వ్యాసం చాలా అసక్తికరంగా వుంది.

    ReplyDelete