Monday, November 14, 2011

పుస్తకాలే మంచి నేస్తాలు !!

కొన్నివేల సంవత్సరాల పైగా నాలుగు వేదాలు, ఉపనిషత్తులు,అష్టాదశ
పురాణాలు ఈ నాటికీ సజీవంగా ఉన్నాయన్న విషయం అందరికీ
తెలిసిందే. ముద్రణా సౌకర్యాలు లేని ఆ కాలంలో ఒకరి నుంచి మరొకరు
నేర్చుకుంటూ ధారణ శక్తి ద్వారా వీటిని సజీవంగా నిలుపుకుంటూ
వచ్చారు. ఇలా వేదాలు చెప్పేవారిని వేదంవారని, రెండు వేదాలు చెప్పే
వారిని ద్వివేదులవారనీ, మూడు వేదాలపై పట్టుగలవారిని త్రివేదులనీ,
నాలుగు వేదాలు చదివిన వారిని చతుర్వేదులనీ పిలిచేవారు. అలాగే
పురాణాలను ప్రజలకు తెలియజెప్పేవారు పురాణం వారుగా వాడుకలోకి
వచ్చారు. అటుతరువాత వాటిని లిఖితరూపంగా రాళ్లమీద, రాగి రేకుల
పైనా, తాటాకుల మీద, అటు తరువాత కాగితం మీద వ్రాయటం ,ముద్రణా
యంత్రాలు వచ్చాక పుస్తక ప్రచురణ మొదలయింది. ఇప్పుడు డిజిటల్
రూపంలో మన సాహిత్యమంతా నిక్షిప్తమవుతున్నది.
ముద్రణ ప్రారంభమయ్యాక ఎందరో మేధావులు, రచయితలు వెలుగులొకి
వచ్చి పాఠకులకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు. వేలాది
సంవత్సరాలనాటి చరిత్ర, నాగరికత ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి ఈ
గ్రంధ ముద్రణ ఎంతగానో తోడ్పడింది. చరిత్రను ఒకసారి చూస్తే అశోకచక్రవర్తి,
విలియం కేరీ లాంటి మహా వ్యక్తులను మనం తప్పక తలచుకోవాలి. ఆశోకుడు
పాళి లిపిని అభివృద్ధి పరచి బౌద్ధమత ప్రచారం కోసం, అహింసా ధర్మాన్ని
చాటటంకోసం శాసనాలు వ్రాయించి లిపిని ప్రచారంలోకి తెచ్చాడు. బైబిల్
ప్రచారంకోసం తెలుగులో 1746-47లో జర్మనీలో బ్లాక్సు సాయంతో అచ్చు
వేయటం జరిగింది. 1901లో విలియం కెరీ కలకత్తా దగ్గరలోని శ్రీరాంపూర్
లో మిషన్లో కూర్చే అచ్చు అక్షరాలు తయారు చేసి సీసంతో పోత పోయించాడు.
అలా ఆనాడు చేతి కంపోజింగు మొదలయింది. మొట్టమొదట బైబిల్ అచ్చయినా
అటుతరువాత వ్యాకరణం, కధల పుస్తకాలు, వాచకాల ముద్రణ మొదలయింది.
19వ శతాబ్దం నుంచి తెలుగు పుస్తకాల ప్రచురణ ప్రారంభమయింది. వావిళ్ళ,
వెంకట్రామా అండ్ కో, రామా అండ్ కో మొదలయిన సంస్థలు పుస్తక ప్రచురుణ
ద్వారా అపార సేవలు అందించాయి. దాదాపు అదే కాలంలో అద్దేపల్లి వారిచే
రాజమండ్రిలో సరస్వతీ పవర్ ప్రెస్ స్థాపించ బడింది. చాలా కాలం వరకు ఆ
ప్రెస్ లో ఆంధ్రా యూనివర్సిటీ వారి పాఠ్య పుస్తకాలు అచ్చయేవి. విశాలాంధ్ర,
నవయుగ, , నవోదయ, యం.శేషాచలం & కో వారు వారి ప్రచురణలతో పాఠకుల
అభిరుచిని పెంచారు. ఎమెస్కో సంస్థ ఇంటింటా గ్రంధాలయం అనే స్కీమును
ప్రారంభించి , "పుస్తక ప్రపంచం" అనే పత్రికనుకూడా ప్రారంభించింది. ఈ బుక్
క్లబ్ లో చేరి అతి తక్కువ ధరకు పుస్తకాలు పొంది పాఠకులు ఇంటింటా స్వంత
గ్రంధాలయాన్ని ఏర్పరుచుకొన్నారు.

టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాక పాఠకుల్లో పఠనాశక్తి తగ్గింది. కానీ ఈ మధ్య
పుస్తకాలు, పత్రికలపై ఆదరణ పెరుగుతుండటం శుభసూచకం. స్నేహితులకు,
ఆప్తులకు వివిధ సంధర్బాలలో పుస్తకాలనే కానుకగా ఇచ్చే అలవాటును చేసు
కోవాలి. పిల్లలకు మంచి పుస్తకాలు కొని చదివే అలవాటును కలిగించాలి.
ఈ రోజు నుండే గ్రంధాలయ వారోత్సవాలు మొదలవుతున్నాయి. ఈ రోజు ఓ
మంచి పుస్తకం తీసి "కొని" చదువుదాం !!
పుస్తకాల కార్టూన్ మితృలు శ్రీ సరసిగారి ( నవ్య వార పత్రిక) సౌజన్యంతో.
ఈ పుస్తకాలయం నాకున్న అతి ఇష్టమైన విలువైన ఆస్ఠి. ఈ పుస్తకాల
మధ్య గడుపుతుంటే నాకు కాలమే తెలియదు.

No comments:

Post a Comment