Friday, December 07, 2012

సినీ ధాత్రి-అభినేత్రి సావిత్రి

            ఎంతోమంది   తెలుగు తారలు సినీ ఆకాశంలో  ఇప్పటివరకు మెరిసినా సావిత్రి మాత్రం
 దక్షిణబారత వెండితెరపై ధృవతారగా వెలిగింది, మిగిలింది.  ఈ తరం తారలు తమ ఒళ్ళు
 చూపటమే , తమ నటనగా భావిస్తే సావిత్రి తన కళ్ళతో, పెదాల కదలికతో శృంగారం,
 విషాదాన్నీ నటించి చూపించి ప్రేక్షకులను కదలించిన మహానటి. నా 12 ఏళ్ళ వయసులో
 1953 లో దేవదాసు రాజమండ్రి అశోక్ మహల్లో విడుదలయింది. శతదినోత్సవం జరిగిన
 సమయంలో గోదావరి వరదలొచ్చాయి. మా మేనమామగారు అప్పుడు ఐ యల్ టీ డీ లో
 ఉన్నతోద్యోగిగా పనిచేసేవారు. ఆల్కాట్ గార్డెన్స్ అంతా వరదనీటిలో మునిగిపోవటం వలన
 కుటుంబమంతా దానవాయిపేటలోని ఓ జమీందారుగారి భవంతిలోకి మారారు. అదే భవనం
 మేడ మీద  దేవదాసు తారలంతా బస చేసారు. అప్పుడు నేను , మా బావతో కలసి మా
 నాన్నగారు తయారు చేసిన ఆల్బంలో సావిత్ర్రిగారి సంతకం తీసుకున్నాను. నాగేశ్వరరావు,
 ఇతర తారల బొమ్మలు కాగితం అరవైఏళ్ళు అవటం వల్ల చినిగిపోయినా సావిత్రి బొమ్మ
 సంతకం ఈనాటికీ మిగలడం ఓ వింత.
 సంసారం చిత్రంలో ఓ చిన్న పాత్రలో "టకు టకు టముకల బండి, కూర్చున్నాడో విగ్రహమండీ"
అనే పాటలో నాగేశ్వరరావును టీజ్ చేస్తున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయిగా అగుపించిన
సావిత్రి అటుతరువాత అదే హీరో ప్రక్క ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల
అభిమాన జంటగా కలకాలం నిలచిపోయారు.

     తమిళచిత్రాలలో నటించి తమిళ తంబీల అభిమాన నటిగా పేరు పొంది ఎన్నో తమిళ చిత్రాల్లో
నాయకుడిగా నటించిన జెమినీ గణేశన్ న్ను వివాహమాడింది.(ఫొటోలు: విజయచిత్ర 1967 విశేష
సంచిక సౌజన్యంతో)
             ఆమె శరీరం ఎంత భారీగా మారినా ప్రేక్షకులకు  ఆమె అద్భుత నటన ముందు అదేమీ గుర్తుకు
రాలేదు. అందుకే బాపుగారు తమ  "బాపు కార్ట్యూనులు"లో " నిండైన విగ్రహం, నటనలో నిగ్రహం
అంటూ చమత్కరించారు. మరువలేని మరపురాని నటీమణి సావిత్రి.
(శ్రీ బాపు గారికి కృతజ్ఞతలతో)

1 comment:

  1. ఆ మహానటి సంతకం మీకు లభించటం చాలా గొప్ప విషయం.
    మరింత జాగ్రత్తగా పది కాలాలపాటు భద్రపరచండి.

    ReplyDelete