Saturday, December 08, 2012

రోజులు మారాయ్ !!

             రోజులు మారటమే కాదు చాలా తొందరగా రోజు రోజుకూ మారిపోతున్నాయ్. అప్పుడే మరో
మూడు వారాలకు కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేస్తున్నాం. మా రోజుల్లో పిల్లల దగ్గర నుంచి
పెద్దలదాకా జీవనం ఇంత వేగంగాలేదు. మేం స్కూల్లో చదువుతున్నప్పుడు పరీక్షలయ్యాక
హాయిగా సెలవులుండేవి. ఇక స్కూలు మరచి పోయి మామయ్య ఊరికో, నాయనమ్మవూరికో
వెళ్ళి గడిపేవాళ్ళం. ఇప్పుడు LKG పిల్లలకూ , వాళ్ల తల్లితండ్రులకూ తీరెకే లేదు. ఇక్కడ మీరు
చూస్తున్న మేడ కు( రాజమండ్రి)  నాకు నాలుగేళ్ళ వయసప్పుడు అద్దెకు వచ్చాము. నేను,
అక్కయ్య, చెల్లాయి ఈ ఇంట్లోనే ఎలిమెంటరీ చదువు నుంచి పై చదువులుదాకా పూర్తి చేశాం.
తరువాత మానాన్నగారు స్టేట్ బ్యాంకులో ఇంకో ఆర్నెల్లకు రిటైరవుతారనగా మా సొంత వూరు
బాపట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. తిరిగి నేను బ్యాంకులో ఉద్యోగంలో చేరాక 1972 లో
రాజమండ్రి వచ్చాక అదే ఇంట్లో సొంత ఇల్లుకొనుక్కునేదాక  మా పిలల్తోవున్నాము. అంటే ఈ
మేడలో మూడుతరాల వాళ్లము వున్నామన్న మాట. ఈ మేడ క్రింద గోడౌన్లుండేవి. పైన పెంకుల
పెద్ద ఇల్లు. పై వరండాలో చెక్క కిటికీల తలుపుల చెక్కలు కదిపితే తెరచుకొనేవి. లోపల చాలా
పెద్ద హాలు ఆ హలుకు రెండు వైపులా రెండేసి గదులు, మొత్తం నాలుగు గదులుండేవి. మేడ
మీదకు వెళ్ళటానికి చెక్క మెట్లుండేవి. పైన పెంకులు కనిపించకుండా గదులపైన చెక్కతో సరంబీ
( ఇప్పటి ఫాల్స్ సీలింగన్నమాట) వుండేది. ఆ ఇంటి ఫొటో తీద్దామనుకుంటుండగానే రెండేళ్ళక్రితం
పడగొట్టి షాపింగ్ కామ్ప్లెక్స్ గామార్చారు.. మనసులో బాగా నాటుకు పోయిన ఆ ఇంటి బొమ్మను
అచ్చు అలానే గీయగలిగాను.
 ఆ రోజుల్లో మాకు వినోదం కొతకాలం వరకూ గ్రామఫోను, అటు తరువాత రేడియో.
మా చిన్నపటినుంచే ఈ బొమ్మలో చూపిస్తున పెద్ద గ్రామఫోనుండేది. తరువాత
1947లో మా నాన్నగారు STEWART WARNER అనే అమెరికన్ రేడియో
కొన్నారు. అప్పుడే ఆ గ్రామఫోనూ రికార్డులూ అమ్మేశారు. నాకింకా బాగా గుర్తు
కొనుక్కున్న వాళ్ళు గ్రామఫోను తీసుకు వెల్తుంటే నేను చాలా గొడవ చేశాను.
అక్కయ్య రేడియోలో మంచి పాటలు, పిల్లల పోగ్రాములూ వస్తాయిరా అని చెప్పి
మరపించింది. రేడియోలో ఏ మైనా మంచి పాట వస్తే ఆ పాటనుమళ్ళీ పెట్టమని
గోలచేసేవాడిని. గ్రామఫోనులా అలా కుదరదురా అని అక్కయ్య చెప్పేది. ప్రతి ఆది
వారం మధ్యాహ్నం 2-15 నుంచి ౩-౦౦ గంతలవరకూ రేడియో అక్కయ,అన్నయ్యల
పిల్లల ప్రోగ్రాములోచ్చేవి. చుట్టుప్రక్కల పిల్లలంతాఆ సమయానికి మా ఇంటికి చేరే
వాళ్ళు. చాలా సందడిగా వుండేది. ఆ ప్రోగ్రాములో పొట్టిబావ-చిట్టిమరదలూ, తాతయ్య,
మొద్దబ్బాయి మాటలు, కబుర్లూ చాలా బాగుండేవి. మేం పెద్దయ్యాక సాయంత్రం
సిలోన్ లో శ్రీమతి మీనాక్షీ పొన్నుదొరై నిర్వహించే తెలుగు సినిమా పాటలు స్కూలు
నుంచి రాగానే వినే వాళ్ళం. అటు తరువాత ప్రతి బుధవారం రాత్రి ఎనిమిదింటికి
రేడియో సిలోన్లో అమీన్ సయాని అద్భుతంగా నిర్వహించే.బినాకా గీత్ మాలా వినే
వాళ్ళం. అప్పటిరోజుల్లో మాకు అవే వినోదాలు. ఆదివారం తెలుగు సినిమాలు సంక్షిప్త
శబ్దచిత్రాలుగా వచ్చేవి. ఇక బాల, చందమామ విడవకుండా చదివే వాళ్లం .బాల
పత్రికలు దాచుకోలెదు కాని అప్పటి చందమామలు ఇప్పటికీ నా దగ్గర వున్నాయ్.
 మా చిన్నప్పుడు వంటకు కుంపట్లు వాడేవారు. బొగ్గుల కుంపటి అన్నమాట  ! బొగ్గుల కుంపటిలో
నెమ్మదిగా కాగిన పాలు చాలా రుచిగా వుండేవి. పులుసు చేయడానికి రాచ్చిప్పలు (అదో రకం
రాయి చెక్కి చేసేవారు) వాడేవారు. అందులో కాగిన పులుసు , చారు చాలా రుచిగా వుంటుందనే
వారు. ఇప్పటిలా నాన్ స్టిక్ పాన్లూ వుండేవి కావి. కూరలూ, పిండి వంటలకూ బాండీ ( బూరెల
మూకుడు) వుపయోగించే వారు. పచ్చళ్ళు చేయడానికి , గారెల పిండి రుబ్బటానికి రోలూ-పొత్రం
వాడేవారు. రోట్లో మా అమ్మగారు చేసిన కంది పచ్చడి రుచే వేరుగా వుండేది..ఇప్పట్లా ప్రెషర్ కుక్కర్లు
లేకపోయినా ఆ రొజుల్లో మా ఇంట్లో రుక్మినీ కుక్కర్ అని వుండేది. గిన్నెలో నీరుపోసి, ఒక గిన్నె మీద
మరో గిన్నె పెట్టి పైన మరో గిన్నె బోర్లిస్తే ఆవిరితో అన్నం ,పప్పూ, కూరలూ వుడికేవి. కానీ దాదాపూ
గంటదాకా పట్టేది.
 అటుతరువాత మా  నాన్నగారు  ఇంగ్లాండులో తయారయిన ఫాక్స్ కిరోసిన్  స్టవ్, మద్రాసు పాపట్
జమాల్ షాపు నుంచి కొన్నారు. ఇప్పటి గాస్ స్టవ్వులా రెండు పొయ్యిలు దానిలో రిబ్బన్ షేపులో
మెటలుతీగతో అల్లిన కాటన్ వత్తులూ , కిరోసన్ రావటానికి ఓ పెద్ద  గ్లాసు సీసా వుండేది. కిరోసిన్, సీసాలో
పోసి బోర్లించి పెడితే స్టవ్వులోకి కొద్ది కొద్దిగా వెళుతూ స్టవ్వు వెలిగేది. కిరోసిన్ ఫ్లో తగ్గించి హెచ్చించ
టానికి కంట్రోలు నాబ్స్ స్టవ్వుకు వుండేవి. కిరసిన్ వెల్తున్నప్పుడల్లా సీసాలో బుడగలు వచ్చేవి. మాకు
ఆ బుడగలు చూడటం అదో సరదా!
  ఆ రోజుల్లో ఇప్పటిలా వాటర్ హీటర్లు, గీజర్లూ లేవు. నీళ్ళను రాగి కాగుల్లో కట్టెల పొయ్యిమీద
 కాచే వారు.తరువాత మేము రాగి బాయిలర్ కొన్నాము.  దీనిలో పాత్ర మధ్యలో రాగి గొట్టం
 వుంటుంది. చుట్టూ నీళ్ళతో నింపి మధ్య గొట్టంలో బొగ్గులు వేసి వెలిగిస్తే వేడికి చుట్టూ వున్న
  నీళ్ళు మరుగుతాయి. వేడి నీళ్ళను పట్టుకోడానికి వీలుగా టాప్ వుంటుంది.

నేను 1981 లో నా గ్రామఫోను కోరిక తీర్చుకోడానికి  ఫిలిప్స్ స్టీరియో రికార్డు ప్లేయర్
  కొన్నాను. ఐనా నాకు నా చిన్ననాటి కీ ఇస్తే పనిచేసే గ్రామఫోను అంటే మక్కువ పోలేదు.
  మా అబ్బాయి అలాటి పాతకాలం గ్రామఫోను కొని నా పుట్టిన రోజు కానుకగా ఐదేళ్లక్రితం
  ఇచ్చాడు. ఈనాడు సిడీలు, విసీడీ, డివీడీలొచ్చినా నాకు మాత్రం ఆ పాతకాలం రికార్డులూ,
  విసీఆర్లూ అంటే ఇంకా మక్కువ పోలేదు. ఎంతైనా పాతకాలం వాడినికదా !!

3 comments:

  1. Appa Rao Garu,
    I have been looking to buy the GramPhone from a long time. Please let me know where it will be available?

    ReplyDelete
  2. ఇంకా ఎన్ని వస్తువుల్ని ఇలా చిత్రాలకి అంకితం చేస్తామో!!!

    ReplyDelete
  3. Sri Sarayu garu, You can get old gramophones at Hyderabad
    from road side vendors.Electronic record players are available from Rs.9000/-to 27,000/- from all major electronic stores Eg: Reliance digital etc.

    ReplyDelete