Sunday, March 28, 2010

దేశ విదేశీ నవ్వుల పత్రికలు-పుస్తకాలు


" నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు...
పువ్వుల వోలె ప్రేమ రసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే నవ్వులు సర్వ దు:ఖ
దమనంబులు వ్యాధులకున్ మహౌషధములు" అన్నారు జాషువా.
మన తెలుగు వాళ్ళం నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్నాం.చిలకమర్తి,మొక్కపాటి,
భమిడిపాటి కామేశ్వరరావు,వాళ్ళబ్బాయి రాధాకృష్ణ,మన ముళ్లపూడి వెంకట రమణ,
ఎవరు పెట్టినా పెట్టక పోయినా ఇబ్బంది లేకుండా పేరుకు ముందే "శ్రీ" చేర్చుకున్న
శ్రీ రమణ,నండూరి,రావి కొండలరావు ఇలా ఎందరో మహానుభావులు! కానీ మనకు
హాస్య పత్రికల కొరత ఇంకా తీరలేదు. గతంలో మా రాజమండ్రి నుంచి "నవ్వులు-పువ్వులు",
"జోకర్"," హాస్యం", ఆవతలి ఒడ్డు కొవ్వూరు నుంచి "పకపకలు" వెలువడెవి.ఇటీవల
వరకు విజయవాడ నుంచి "హస్యానందం' వచ్చేది.ఎందుకో కనుమరుగైంది. గతంలో ఆంధ్ర
వార పత్రిక వినాయక చవితికి హాస్య ప్రత్యేక సంచిక ప్రచురించేది.1963లో బాపు రమణల
మిత్ర బృందం "జ్యోతి" మాస పత్రికను కధలతో బాటు ప్రతి పేజీలోనూ మంచి మంచి కార్టూన్లు,
జోకులు,ఆరుద్ర అచ్చు తుప్పులు,పఠాభి పంచాంగం ( పంచాంగం అంటే జ్ణాపకం వచ్చింది.ఓ
ఉగాదికి నవ్వుల పంచాంగం అనుభంధంగా వేశారు).1964లో "జ్యోతి"లో జోకులూ,కార్టూన్లు
గట్రా చోటు చేసుకున్న "రసికజన మనోభిరామము" అను యన్టూవో అన్న పుస్తకాన్ని అచ్చు
వేసి అభిమానుల మీదికి వదిలారు. 88 పెజీల పైగా వున్న ఆ పుస్తకం ధర 1964లో ఒకే
ఒక్క రూపాయి !! తమిళంలో "ఆనంద వికటన్" అనే పత్రిక ఇప్పటికీ వస్తున్నది.భాష రాక
పోయినా అందులోని గోపులు గారి కార్టూన్లు చూసి ఆనందించే వాళ్ళం. తమిళ హాస్య నటుడు
చో రాజకీయ పత్రిక "తుగ్లక్" కూడా తమిళనాడు లో ప్రాచుర్యం పొందింది.ఇంగ్లీష్ లో "మాడ్"
(బ్రిటిష్)పత్రిక పారడీ కార్టూన్లతో ,పేజీలు మడత పెడితే బొమ్మల భావాలు మారి పోయే బొమ్మల
(వి)చిత్రాలతో వెలువడుతుంది.ఈ పత్రికను అనుకరిస్తూ ఢిల్లీ నుంచి "దివానా" అనే పేరుతో ఇంగ్లీష్,
హిందీలలో ఓ పత్రిక కొంత కాలం వెలువడింది.అలాగే అమెరికా నుంచి "పంచ్" పేరుతో హాస్య
పత్రిక వస్తున్నది
"జ్యోతి" నుంచి ఆనాటి బాపు కార్టూన్, 'మాడ్' ,'పంచ్' పత్రికల బొమ్మలు చూడండి.
మరి ఈ రోజుకు ఉంటాటాటాటా టా టా టా...........మరునాడు కలుసుకుందామా మరి.!!

3 comments:

  1. ప్రజాదరణ ఉంటే పత్రికలు బతుకుతాయి. నెలకు 200 నుంచి 300 వరకు కేబుల్ టి వి కి కడుతున్నాం కాని, ఎంతమందిమి మంచి పత్రికలు కొంటున్నాము. మనకు మంచి పత్రికలు ప్రస్తుతం లేకపోవటానికి కారణం, టి వి పట్ల మనకున్న వెర్రి.

    ReplyDelete
  2. శివ ప్రసాద్ గారు, అవునండీ.'హాసం'లాంటి మంచి పత్రికలు ఆగిపోడానికి కారణం
    మనమే. సినిమాలకు వెళ్ళి ఎమ్తో ఖరీదు పెట్టి ఆడంబరంగా సాఫ్ట్ డ్రింకులూ, జంక్
    ఫుడ్లూ కొంటారుకాని ఓ పత్రిక, పుస్తకం కొనే వాళ్ళెంత మంది? కిళ్ళీ కొట్లో జర్దానో,
    సిగరెట్టో కొంటాడు కాని తోరణాలగా వేలాడుతూ స్వాగతం పలికే పుస్తకాల వైపు కన్నెత్తి
    ఐనా చూడం!

    ReplyDelete
  3. అవునండీ అప్పారావు గారు నిజంగా దురదృష్టకరం।
    మనము ఇంకో సారి హాస్యపత్రిక ప్రారంభించడానికి ప్రయత్నిద్దాం।
    కనీసం నెట్టులోనైనా ప్రారంభిస్తే బాగుంటుందేమో।
    మిత్రులు ప్రయత్నించి విరమించినట్టున్నారు।

    ReplyDelete