Monday, October 25, 2010

తీపి కబుర్లు


" ఏ దైనా స్వీట్ చేయొచ్చు కదా?" అన్నాను శ్రీమతితో.
"ఎలా చేస్తానండీ, షుగరు లేదు కదా" అంది వెంటనే.
" అందుకే కదా స్వీట్ చెయ్యమన్నది" అని అనగానే,
"చూడబొతే మీకు రాను రాను చాదస్తం ఎక్కువవు
తున్నట్టుంది, షుగరు లేకుండా స్వీట్ ఎలా చేస్తారండీ"
అంది.
"షుగరులేదు కదా" అన్న నాభావం మన ఒంట్లో లేదు
కదా అని. ఆవిడ చెబుతున్నది ఇంట్లో షుగరు అయి
పోయిందనిట!!
ఎన్ని సార్లు చెప్పినా మా శ్రీమతి వంటింట్లో ఏ సరుకైనా
ఆఖరి చెంచా వరకూ చెప్పదు. మా పిల్లలు ఓ బుల్లి
స్క్రిబిలింగ్ పాడ్ ,ఓ బాలు పెన్నూ కిచెన్లో వుంచి ఏదనా
ఐపోగానె నోట్ చేసుకోమని చెప్పారు. కానీ షరా మామూలే.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
కొన్నిట్లో షుగరు, (ఇక నుండి తెలుగులో పంచదార అనే
అందాం.కొంతమంది చక్కెర అని కూడా అంటారు.) వెయ్యక
పోయినా బాగుంటుంది. ముఖ్యంగా కాఫీ లో పంచదార
ఎంత తక్కువ వుంటె అంత రుచిగా వుంటుంది. అదే టీ
అనుకోండి, చేదుగా బాగుండదు. పంచదార,బెల్లం ఒకే
చెరకు నుండి తయారయినా వాటి రుచి తీపే ఐనా పంచదారకే
ప్రాముఖ్యం ఇస్తారు. బెల్లం తో చేసిన లడ్డు అంటే అదేమిటో
చిన్నచూపు. కాని కొన్నింటిని బెల్లంతో చేస్తేనే రుచి.ముఖ్యంగా
మినపసున్ని. పంచదారతో కన్నా బెల్లం కోరిచేసిన రుచే వేరు,
అలానే కొబ్బరికోరు,బెల్లం కలిపి చేసే కొబ్బరి లౌజు పేరు
వింటేనే నోరూరిపోతుంది.మా చిన్ననాటి రోజుల్లో మిఠాయి
కొట్లలో పంచదార చిలకలు అమ్మే వారు. ఇప్పుడయితే స్వీట్
షాపులుకూడా మోడరన్గా మారిపోయాయి. అక్కడా ఈ మధ్య
పంచదార బొమ్మలు అగుపిస్తున్నాయి. రకరకాల బొమ్మలు
వివిధ సైజుల్లో దొరుకుతున్నాయి. పంచదారపాకం అచ్చుల్లో
పోసి వీటిని తయారుచేస్తారు. వేడుకల్లో వీటిని పంచుతుంటారు.
ఏదైనా తీపి కబురు చెబితే అది విన్న వారు ఆనందంతో చెప్పిన
వారి నోట్లో పంచదారపోసి నోరు తీపి చేయటం ఆనవాయితీ!
ఆనవాయితీగా ఓ సరికొత్త పాత జోకు>>>>>>
మీ హోటల్లో స్వీట్లు సరే ,ఎలాగో చల్లగా వుంటాయి.
మరి హాట్ గా ఏముండవా?
ఎందుకుండవు సార్! పొయ్యిలో నిప్పులున్నాయ్!
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
సంగీతం కూడా తియ్యనిదే! అందుకే కాబోలు తియ్యగా తియ్యగా
రాగం అన్నారు!!
మన తెలుగు భాషకూడా ఎంతో తియ్యని భాషైనా మన (వి)నాయకులు
మన తెలుగు కళాతోరణం నుంచి "తెలుగు" ని "తియ్య" కుండా వుండ
లేక పోతున్నారు.
ఇక తియ్యని కొన్ని తెలుగు సామెతలు చిత్తగించండి
పానకంలో (పంచదార/బెల్లం) పుడకలాగ.
చక్కెర తిన్న నోటితో తవుడు బొక్కినట్లు
చెరకు రసముకన్న చెలిమాట తీపిరా
బెల్లమున్న చోటే ఈగలు ముసిరేది
పెళ్ళాం బెల్లం తల్లేమో అల్లం!!
<<<<<<<<<<<<<<<<<<<<
యోగి వేమన ఈ మధురమైన పద్యం చెప్పారు
అనగనగారాగ మతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తీపినుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!
మన సినీ కవులుకూడా మధురమైన పాటలు
ఎన్నో వ్రాసారు. శ్రీ కృష్ణసత్య చిత్రం లో పెండ్యాల సంగీత
దర్శకత్వంలో ఘంటసాల,జానకి పాడిన ఈ మధురమైన
పాటను శ్రీ సి.నారాయణరెడ్డి వ్రాసారు.ఆ పాటలో కొంత:
ప్రియా ప్రియా మధురం
పిల్లన గ్రోవి-పిల్లవాయువూ బలే బలే మధురం
అంతకుమించి ప్రియుని కౌగిలి
ఎంతో ఎంతో మధురం
ఇన్నీ వున్నా సరసిజలోచన సరసనవుంటేనే మధురం
మనసిచ్చిన ఆ అలివేణి అధరం మరీ మరీ మధురం
అవండీ నా తీపి కబుర్లు!!

1 comment:

  1. మితృలు హనుమంతరావుగారూ, మీరు స్వీట్ అంటే అంత
    భయపడితే ఎలాగండీ! తీపి కబురు మీద మీ కామెంట్
    ఇ.వీ.వీ గారి దగ్గరకు వెళ్లీ చెప్పారు.అప్పుడప్పూడూ స్వీట్
    తినాలండీ దినవహి గారూ!

    ReplyDelete