Sunday, January 30, 2011

ఆంధ్రపత్రిక అంగీరస సంవత్సరాది సంచిక ( 1932 )





ఆంధ్రపత్రిక దిన పత్రిక ప్రతి ఏడాది ఉగాదికి దాదాపు 265 పేజీలలో ఇప్పటి
వార పత్రికల సైజులో వార్షిక సంచికను ప్రకటించేది.నిన్ననే నా మితృలు
ఫణి నాగేశ్వరరావు గారు 1932 నాటి ఆంద్రపత్రిక ప్రత్యేక సంచికను నాకు
చూపించారు. పాత పత్రికలంటే అమిత ఇస్ఠపడే నేను ఆశ్చర్యపడి, లేచి
"79 ఏళ్ళ నాటి పత్రిక ఎక్కడ సంపాదించారండీ?" అంటూ అడిగాను.
ఆయన పాత న్యూస్ పెపర్లు అమ్మే అతను తన మెడికల్ షాపుకు మందుల
కోసం పేపర్ల తోపుడు బండితో సహా వచ్చి మందులు కొనుక్కున్నాడట. బిల్లు
అమౌంటు చెప్పి ఆ బండి వైపు చూడగానే బౌండు చేసి వున్న మూడు
పుస్తకాలు కనిపించాయట. ఏమిటా పుస్తకాలు చూపించమని అడిగితే
అవి ఆంధ్రపత్రిక , భారతి పత్రికలట! "వాటిని నాకుఇచ్చేయ్, నువ్వు మందులకు
డబ్బు ఇవ్వసరం లేదు" అనగానే ఇచ్చేసాడట! అలా ఆ పుస్తకాలు దొరికాయని
చెప్పారు. 1932 సంచికలో శ్రీశ్రీ, సముద్రాల, మల్లాది రామకృష్ణ శాస్త్రి,,దీపాల
పిచ్చయ్య శాస్త్రి, సామవేదం జానకీ రామ శర్మ, చిత్రకారుడు, రచయిత బసవరాజు
అప్పారావు మొదలయిన ప్రముఖుల రచనలు, తెలుగులో మొట్టమొదటి
కార్టూనిస్టు శ్రీ తలిసెట్టి రామారావు గారి కార్టూన్లు, మంత్రవాది వెంకటరత్నం,
డి.పాపారావు, చామకూర సత్యనారాయణ గార్ల గీసినచిత్రాలు వున్నాయి.
ముందరి పేజీలోని ప్రస్తావనలో "చీనా-జపాను పోరాటము గురించి ఇలా
వుంది: ’ఎవరును నూహింపనిరీతిని చీనా-జపాను పోరాటము ప్రజోత్పత్తి
సంవత్సరమునందు ప్రారంభమయ్యెను.ప్రపంచమునందిది మిగుల ఆశ్చర్యము
గలిగించియుండుట వింత గాదు."......... అందులోనే నూతనసంవత్సరము గురించి
వ్రాస్తూ, "నూతనసంవత్సరము శుభదాయక మగునా, లేక అనిష్టహేతు వగునా
యని వితర్కించుట ప్రజలకు పరిపాటి యయినది. కాని,శుభాశుభములుగాని,
లాభనష్టములుగాని, మానవులవైఖరి ననుసరించి యుండును."
ఈ సంచికలోని శ్రీశ్రీ రచించిన " దివ్యాను భూతి" మీ కోసం
సంకులపయోధరచ్చటాపంకిలనిబి
డాంధకారనిర్జనవీధికాంతరముల
నా చరించెడువేళ ప్రోన్మత్తరీతి,
అవశ మొనరించు దివ్యతేజోనుభూతి
సరసియై చల్లనై నన్ను జలకమార్చె;
నందనవనీలతాంత కాంతస్రజమ్ము
గా నొకక్షణమ్ము నా మెడ కౌగిలించె.
కాలభటులు తొందరగా వినీలదీర్ఘ
సూత్రహస్తులు నను డాసి సుమదళీప
రీమళావృతమద్గళసీమకాంచి
తలకి తలయూచి ఇరులకై తరలినారు.
ఇపుడు మేఘముల్ విచ్చిపోయినవి నాకు
గగనమందె కలదు తారకాస్రజమ్ము,
ఇంక నే నిత్యరాకాశశాంకమూర్తి
నై నభో రాజ్యపాళిక లావరింతు !
--శ్రీరంగం శ్రీనివాసరావు గారు,బి.ఏ.,
<><><><><><><><><><>
ఆ కాలం లో (1932) ధరలు ఎలా వుండేవో ఈ హోటల్
ప్రకటన చూడండి !!

ది న్యూ నేషనల్ హిందూ హోటల్
స్పెషల్ బోర్డింగ్ అండు లాడ్జింగ్
ఆచారము గల బ్రహ్మణులవలన వంటచేయబడి,రుచికరమగు భోజనము
పెట్టబడును. మంచి గాలి వచ్చు రూములు ఎలక్ట్రిక్ దీపములతో నివ్వబడును.
వేడినీళ్ళు స్నానమునకు ఇవ్వబడును. దినము 1-కి మనిషి 1-కి స్పెషల్
బోర్డింగ్ రు.1-8-0, ఆర్డనరీ రు.1-0-0
యస్.యం. రంగనాధ అయ్యర్, ప్రొప్రయిటర్, 153, మింటు వీధి,మద్రాసు
Two Meals, two tiffins, bath per day charges Rs.1-8-0 (Special)
Ordinary: Two meals, bath per day charge.Rs.1-0-0
<><><><><><><><><><><><><><><><><><><><><><><><>
ఇక్కడి చిత్రాలు: ఉగాది 1910 సంచిక మొదటి పేజీ, ఆంధ్రపత్రిక వ్యవస్ఠాపకులు
విశ్వదాత కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు, తలిసెట్టి రామారావు గీసిన
చిత్రం, మరో చిత్రకారుడు వేసిన చిత్రం ( పేరు తెలియలేదు)



2 comments:

  1. అంత పాత ‘ఆంధ్రపత్రిక’ సంచిక మీకు అనుకోకుండా కనపడిందన్నమాట. దీనిలో ప్రచురించిన శ్రీశ్రీ ‘దివ్యానుభూతి’ ప్రౌఢ గ్రాంధిక శైలిలో ఉంది.

    అన్నిటికీ మించి- అలనాటి హోటల్ ప్రకటన చూస్తే... భలే నవ్వొస్తోంది! బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అనే పదబంధ ప్రయోగం (which is not correct) అప్పట్నుంచీ ఉందన్నమాట!

    ReplyDelete
  2. మీ కంట బడటం నాకు కొంత కుళ్ళుగా కొంత సంతోషంగా వుంది సార్!నాకు దొరకలేదే అని కుళ్ళు...మీలాంటి వారికి దొరికింది కదా ..ఇలా నలుగురితో పంచుకుంటారు అని సంతోషం. ఏమైనా మీకు చాలా విలువయిన పై టపా అందించినదుకు చాలా ధన్యవాదాలు అప్పారావు గారూ!

    ReplyDelete