Friday, January 14, 2011

సంబరాల సంక్రాంతి



కొత్త సంవత్సరం వచ్చింది. అప్పుడే మొదటి పండుగా వచ్చేసింది!
దేశంలో ఇప్పుడంతా యమస్పీడ్. కళ్ళు తెరచేలోగా రోజులూ నెలలూ
మారిపోతున్నాయి. మునుపటికాలంలో పెద్దపండుగ వస్తున్నదంటే
నెలముందు నుంచే ఎంతో సందడి. చీకటిపడగానే అమ్మాయిలూ,వాళ్ళ
అమ్మలూ ఎంతో సందడిగా ఇంటి ముందు ముగ్గులు తీర్చి దిద్దేవాళ్ళు.
అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక ఇక అందరిదీ ఒకే గుమ్మం! మూకుమ్మడిగా
ఆ బిల్డింగ్ ముందే ఒకే ముగ్గు. ఇక వివిధ పత్రికలు, పెద్ద షాపింగ్ మాల్
వాళ్ళూ నిర్వహించే ముగ్గులపోటీల్లోనే అమ్మాయిలుపగటిపూటే ముగ్గులు
వేసేస్తున్నారు. గంగిరెద్దు దాసరులు, హరిదాసులను ఇక టీవీల్లోనే మన
పిల్లలకు చూపించాలి. అధిస్ఠానం ఎదుట గంగిరెద్దుల్లా తలాడించే
మన రాజకీయ నాయకులే మనకు ఇప్పటి గంగిరెద్దులు!
ఈనాడులో శ్రీ శ్రీధర్ గీసిన కార్టూన్ సమయానుకూలంగా చాలా
బాగుంది. గాలిపటాలలా పైపైకీ ఎగిరిపోతున్న ధరలు గురించి మరచి
పోవడానికి ఈ పండగనాడు కొన్ని జోకులు చెప్పుకొని నవ్వుకుందాం!
:) :) :) :) :) :)(: (: (: (: (:
ఓ అర్ధరాత్రి మొహానికి ముసుగు వేసుకున్న ఓ దొంగ హైద్రాబాద్
టేంక్బండ్ మీద వెళుతున్న ఓ కారుని ఆపి, తుపాకి చూపిస్తూ
చెప్పాడు.
" నీ దగ్గరున్న డబ్బు ఇవ్వు."
ఆ కారుని నడుపుతున్న యజమాని వెంటనే ఇలా అన్నాడు.
"నన్ను వదలిపెట్టు. నేను ఆంధ్రప్రదేశ్ లో ఓ యం.ఎల్.ఏ ని
తెలుసా?"
"అలాగా! అయితే నా డబ్బునాకివ్వు " అన్నాడు తుపాకీ
చూపిస్తూ.
:) :) :) (: (: (:
"మా నాన్నగారికి తను ఏ సంవత్సరంలో మరణిస్తాడో తెలుసు.
అంతేకాదు, నెల, తేదీతో పాటు టైము కూడా తెలుసు "
"అలాగా ? మీ నాన్నకా సంగతి ఎలా తెలుసు ? జ్యితిష్య పండితుడా?"
"అదేంకాదు, ఆయనకు ఉరి శిక్ష పడింది"
;) :) :) :) (: (: (:
ఒకతను రద్దీగా వున్న వీధిలో నడుస్తుంటే ఆకాశవాణి ఇలా అంది.
" ఆగు, రోడ్డు అప్పుడే దాటకు"
అతనాగగానే తాగి కారు నడుపుతున్న దేవదాసు వేగంగా
దూసుకు వచ్చి ఇద్దర్ని గుద్దాడు.
" ఇప్పుడు రోడ్డు దాటు" అంది ఆకాశవాణి.
అతను రోడ్డు దాటి కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆకాశవాణి పలికింది.
అతనుఆగిపోయాడు. పక్కనే నిర్మాణం జరుగుతున్న బిల్డింగునుంచి
ఓ ఇటుకరాయి వచ్చి పడింది. ఇక నడు అంది మళ్ళీ ఆకాశవాణి.
అతను తల పైకి ఎత్తి అన్నాడు.
"నన్ను రెండు సార్లు కాపాడినందుకు ధాంక్స్. కాని నా పెళ్ళి
నాడు నువ్వేమయ్యావు? అప్పుడూ ఇలా కాపాడొచ్చుగా!"
<><><><><><><><><><>
పిచ్చికుక్క కరచిన రంగనాధయ్యకు ఆయన ప్లీడరు ఇలా
సలహా యిచ్చాడు. "మరేమీ అనుకోకండి. ఎటునుంచి ఎటు
వచ్చినా సిద్ధపడి ఉండటం కోసం ఇప్పుడే మీ వీలునామాను
రాయడం మంచిది" సరేనని రంగనాధయ్య కాగితమూ కలము
పుచ్చుకొని ఓ గంటకు పైగా ఏదో రాస్తూ కూర్చున్నాడు.
"చాలా పొడుగాటి వీలునామా రాస్తున్నట్టున్నారే" అన్నాడు.
"వీలునామాకాదు,చట్టుబండలూ కాదు.నాకు పిచ్చి పట్టాక
ఎవరెవరిని కరవాలో వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాను"
అన్నాడు రంగనాధయ్య.
<><><><><><><><><>
కొత్తగా పెళ్ళయిన మన్మధరావు ఇల్లు పుర్తిగా పెళ్ళికానుకలతో
నిండిపోయింది. భర్యాభర్తలిద్దరు వాటిని చూసి మురిసిపోతుండగా
కోరియర్లో సెకండ్ షోకి రెండు సినిమా టికెట్లు వచ్చాయి. అందులో
వున్న చీటీలో "ఇవి పంపిందెవరో కనుక్కోండి" అని వుంది. ఎంత
ఆలోచించినా ఎవరో తెలియలేదు. ఎవరైతేనెమి అనుకుంటూ ఇద్దరూ
సెకండ్ షోకి హుషారుగా వెళ్ళి వచ్చాక ఇల్లంతా గుల్లయి వుంది.
టేబుల్ పై ఓ చీటీ కనిపించింది. అందులో ఇలా రాసి వుంది.
"ఇప్పటికైనా తెలిసిందా నేనెవరో ?"
<><><><><><><><><><><><>
ఈ రోజు, "నవ్వక పోవడం ఓ రోగం, నవ్వడం ఓ భోగం" అన్న జంధ్యాల
జయంతి. ఆయనకు జోహర్లర్పిస్తూ ........
( కార్టూన్ "ఈనాడు" సౌజన్యంతో..జోకులు మల్లాది "హాస్యానందం",
రాజగోపాల్ "నవ్వులకధలు" ఆధారంగా)
సంక్రాంతి సంబరాలను ఒక్క బొమ్మలో చూపించిన బాపూ
బొమ్మ "హరివిల్లు" సౌజన్యంతో
అందరికీ ఈ సంక్రాంతి సకల శుభాలను అందించాలని మనసారా
కోరుకుంటూ.........

No comments:

Post a Comment