Tuesday, January 04, 2011

మరో మంచి పుస్తకం- చమత్కార స్రవంతి


ఈ పుస్తకరచయిత డా"పి.వి.యల్.నరసింహారావుగారు చక్కని హాస్యాన్ని
జోడించి మనల్ని నవ్వించి కవ్వించారు. ఓ కార్టూన్ గీయాలన్నా, ఓ
హాస్య కధో, గేయమో చెప్పాలన్నా ఐడియాలు మన చుట్టూ అగుపిస్తూనే
వుంటాయి ఇలాటి వివిధ విషయాలను ,విశేషాలను శ్రీ నరసీంహారావు
తమ "చమత్కార స్రవంతి"లో ప్రతి పేజీలోనూ అవిష్కరించారు ముందు
మాటలో కోర్టు తాలూకు చమత్కారాన్ని చెప్పారు (ఆయన కొంతకాలం
న్యాయవాదేనట!) ఒక న్యాయవాదిని చూసి న్యాయమూర్తి "ఏమిటండీ
అలా వెదుకుతున్నారు హడావుడిగా?" అంటే "యువర్ ఆనర్, నా కోటు
కనిపించటంలే"దన్నాడట. " అంతేనా, ఇక్కడ ఎంతమందో సూట్లే పోగొట్టుకొని
మాట్లాడకుండా బైటకుఫోతుంటారుగా?" అని చురక అంటించారు న్యాయమూర్తి.
అందరూ తనివి తీరా నవ్వుకొన్నారు. ఆయన చెప్పిన ఈ హాస్య సంఘటన
లానే ఇందులోని పద్యాలన్నీ మనల్ని నవ్వుల్లో ముంచెత్తటం గ్యారంటీ.
మచ్చుకు కొన్ని చమత్కారాలు రుచి చూడండి. ఆనక ఈ చమత్కారాల
విందును పూర్తిగా ఆరగించాలంటే వెంటనే ఓ పుస్తకం కొనేసుకొని తృప్తిగా
ఆనందించేయండి. ఒక సారి రుచి చూస్తే మరొసారి మరో సారి మీరొదలురు!
<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>
ఈ నాటి పిల్లలు తినే జంక్ ఫుడ్ గురించి....
గారెలు బూరెలు పెరుగు కమ్మని నేయియు ముద్దపప్పు, గోం
గూరయు కంది పచ్చడియు గుంటురికారము ఆవకాయయున్
కోరి భుజించు పెద్దలకు గొంతులు నిండగ, ఐసు క్రీము, మం
చూరియ గోబివాచవిని చూసెడి పిల్లలకెట్లు తృప్తియౌ.
ఇక ఇల్లాల్లకు తీరిక ఎక్కడిది అంటూ....
కంటికి జోడు ఫ్యాషనుకు కాలికి జోడును ఎత్తు పెంచగా
ఒంటికి పౌడరున్ పులిమి ఒద్దిక పాలిషు గోళ్ల కద్ది కా
న్వెంటుకు పంపుపిల్లలకు వేషము వేయుచు సర్ద బుక్కులున్
ఇంటిని తీర్చిదిద్దుటకు ఇంతికి తీరిక ఎట్లు చిక్కెడిన్ ?
మిన్నంటే ధరలను గురించి చివరిగా ఇలా అన్నారు.....
ధరలెటు చూసినన్ పెరగ దద్దరిలెన్ ప్రజ్ఞ పండు పంటకున్
ధరపడి పోవుచుండ పరితాపము చెందెను పేదరైతు, సం
స్కరణల పైకి క్రిందకును కాంగ్రెసు వారలు త్రిప్పుచుండ, ఏ
సరణిని జీవితమ్ము కొనసాగునటంచు జనమ్ము చింతిలన్.
(ఇది వ్రాసింది 2007 లో! 2011 లో కూడా అదే పరిస్ఠితి!)
ఈ చమత్కార స్రవంతిని " చమ(త్కారాలు) నూరటంలో చెయ్యి తిరిగిన
వారి శ్రీమతి కి నరసీంహారావుగారు అంకితమివ్వడం ఎంతో సమంజసం!
అంద.మైన ముఖచిత్రం గీసింది, ఇంకెవ్వరు ? శ్రీ బాపు.! లోపలి బొమ్మల్ని
ఇండియా టుడే నర్శిం చిత్రించారు ఋషి ప్రచురణలు విజయవాడ వారు
పాతిక రూపాయలకే అందంగా అందిస్తున్నారు.

No comments:

Post a Comment