Monday, April 19, 2010

సినీమా ( యా ) వినోదం


పూర్వం సినిమాలు నిర్మించడానికి దాదాపు రెండు మూడేళ్ళు పట్టేది. స్క్రిప్ట్, సంగీతం
విషయాల్లో ప్రత్యేక శ్రర్ధ తీసుకొనేవారు. అలానే నటీనటుల తమ స్వంత గొంతుతోనే
సంభాషణలు చెఫ్ఫెవారు. మొదట్లో పాటలు కూడా పాడగల ప్రావీణ్యం వున్న వారికే
అవకాశం వుండేది. ఆ రోజుల్లో నిర్మించిన చిత్రాల్లోని నటుల స్వరాన్ని బట్టి హాల్లోకి
వెళ్లకుండానే తెర మీద ఏ నటుడు సంభాషణ చెబుతున్నాడో చెప్పగలిగే వారము.
మరి ఈ నాడో ఏ హీరోయినికీ ఆటలాడడమే కాని మాటలాడడం రాదు. ఇప్పుడు
సినిమా విడుదలకాకుండానే ప్రెస్ మీట్లు, పది రోజులు దాటగానే విజయ యాత్రలు,
బ్రహ్మాండంగా పాటల సీడీల విడుదలతో హోరెత్తిస్తున్నారు. అందులో నిజంగా విజయ
వంతమైన సినిమాలు కొన్నే. నేటి ఈ సినిమా ఫంక్షన్ల గురించి నవ్వులాటగా నే మా
హాసం క్లబ్ కోసం ఇదివరలో నే వ్రాసిన ఈ వ్యంగ్య రచన ఇక చదవండి.
సినీమా (యా)వినోదం
ఆహాఓహో ఫిలింస్ తమ చిత్రం ’నీనా’ విడుదలై ’పోయిన’ సంధర్భంలో విలేఖరుల
సమావేశం ఏర్పాటుచేసారు. హీరో తండ్రి ,అక్క, తమ్ముడు మాట్లాడుతూ ఇది తాము తీసిన
మహత్తర కుటుంబ చిత్రమని చెప్పారు. దర్శకుడు శ్రీ అయోమయం ఇది చాలా సులువుగా
అర్ధం కాని కధా చిత్రమని దీన్ని మొదటి ఆట చూసి కధను చెప్పగలిగేవారు తమ స్వంత
ఖర్చులతో రాజధానికి వచ్చి కధ వివరిస్తే నేల టిక్కేట్లు రెండు బహుమతిగా ఇస్తామని,తిరిగి
వెళ్ళాక చిత్రం ఇంకా ఆడుతుంటే మరో సారి చూసి మరో విధంగా కధ వివరిస్తే మరో బహుమతి
వుంటుందని తెలియజేసారు. నిర్మాత మాట్లాడుతూ ధియేటర్లలో సగం జనం నిండుతుంటే తమంటే
గిట్టనివాళ్ళు, సగము ఖాళీ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేశంగా అన్నారు. చిత్రం హీరో మాట్లా
డుతూ ఈ సిన్మా చూసిన వాళ్ళే తిరిగి చూస్తున్నారని చెప్పగా ’కొంటెకోణంగి’ సినిమా పత్రికా
విలేఖరి "ఎవరు ? ఆపరేటర్లు,గేట్ కీపర్లా ?" అని అడిగితే " ఏం వాళ్ళు మాత్రం ప్రేక్షకులు కారా?"
అంటూ కోపంగా డాన్సు చేశారు.
* * * * * * * * * * * *
’చీ చా’ ప్రొడక్షన్స్ చిత్రం ప్రారంభం సంధర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటుచేసారు. తమ చిత్రం పేరును
" చూస్తే చస్తావ్ !" గా నిర్ణయించామని, హీరోయిన్గా ఏదో దేశం అమ్మాయిని ఎన్నుకున్నామని,
ఆవిడ పేరు తెలియదని, ప్రక్కనే ఆ అమ్మడు వున్నా తెలుసుకుందామంటే యూనిట్లో ఎవ్వరికీ
ఆమె భాష తెలియదని వాపోయారు. ఈ చిత్రం ఆడియో విడుదల కొత్త పంధాలో చేస్తున్నామని
మార్కెట్లోకి బ్లాంకు సిడీలు ప్రవేశపెడ్తామనీ,దీనివల్ల పైరసీని అద్భుతంగా అరికట్టవచ్చనీ తెలిపారు.
చిత్రం విడుదలయ్యాక ఆ సిన్మా చూసినవాళ్ళుంటే ఆ బ్లాంక్ సిడీని వాళ్ళ కంపెనీ ఎడ్రస్ కనుక్కొని
తెస్తే తమ సంగీత దర్శకులు కాపి రావు ( కాకాని పిచ్చేశ్వరరావు) గారు సరసమైన ధరకు ఆ సిడీని
కాపీ చేసి ఇస్తారని తెలియజేసారు.
ఇంతటితో ఈ ప్రెస్సు మీట్ సమాప్తం !

2 comments:

  1. బ్లాంకు సి.డి ఆలోచన బాగుంది... :)

    ReplyDelete
  2. >ధియేటర్లలో సగం జనం నిండుతుంటే తమంటే గిట్టనివాళ్ళు, సగము ఖాళీ అని దుష్ప్రచారం చేస్తున్నారని

    :-)

    ReplyDelete