Sunday, April 25, 2010

శ్రీ శ్రీ శతజయంతి , టొకున శ్రీ శ్రీ జోకులు !!

" శ్రీ శ్రీ పుట్టిన తేదీ 15-4-1910 కావచ్చు.లేదా 30-4-1910 కావచ్చు. అతడు మాత్రం
తాను 2-1-1910 నాడు జన్మించానని విశ్వసించాడు.ఇది శ్రీశ్రీగా సుపరిచితుడైన శ్రీరంగం
శ్రీనివాసరావు జన్మ విశేషం. ఒక పరిశోధకుడి ప్రకారం శ్రిణివాసరావు సాధారణ నామ
సంవత్సర చైత్ర శుద్ధ సష్టినాడు- అంటే 1910 ఏప్రియల్ 15వ తేదీన జన్మించాడు .
విశాఖపట్ణం పురపాలక సంఘం వారు ఖరారుచేసిన తేదీ 30-4-1910 అని విరసం వారు
సృష్టీకరిస్తున్నారు. అతడు 1910లో జన్మించాడనేది నిర్వివాదాంశం"--( మహాకవి శ్రీశ్రీ-
బూదరాజు రాధాకృష్ణ-సాహిత్య అకాడమీ ,ఢిల్లీ ప్రచురణ ) ఆయన శత జయంతి ఈ నెలలోనే.
టోకున శ్రీశ్రీ జోకులు
* ఒకసారి మదరాసు సెంట్రల్ స్టేషనులో శ్రీశ్రీ కనబడితే మొక్కపాటి నరసింహశాస్త్రిగారు
" ఊరికేనా ? " అని ప్రశ్నించారు.
" ఊరికే " అని శ్రీ శ్రీ సమాధానం.
** ** ** ** ** ** ** ** ** ** **
* ఈ రెండో జోకులోనూ శ్రీశ్రీ గారే కధానాయకుడు. మదరాసులో పూర్వం ఒక తెలుగు
కాఫీహొటేలు వుండేది. దాని ప్రత్యేకత పెసరట్లు. కొందరం వెళ్ళి కుర్చీలలో కూర్చొని కావలసినివి
ఆర్డరిస్తున్నాం.శ్రీశ్రీ తనకు సహజమైన పరధ్యానంలో వున్నాడు. అందరం అట్లు ఆర్డరుచేసి "శ్రీశ్రీ
గారూ ! మీకూ అట్టు చెప్పేం " అన్నాం.
ఆయన " అట్లే కానిండు" అన్నాడు.
** ** ** ** ** ** ** ** ** **
* ఒకసారి....ఈసారి మదరాసులో కాదు, విశాఖపట్టణంలొ, ఆందులోనూ సముద్రతీరాన శ్రీ శ్రీ
గారు, వేదుల సత్యనారాయణశాస్త్రిగారూ కలసి నడుస్తున్నారు. వేదులవారు అనే రోలు శ్రీ శ్రీ అనే
మద్దెలతో తన కష్టాలు చెప్పుకొని " ఎందుకొచ్చిన బ్రతుకు శ్రీ శ్రీ ! మనిషిగా, పైపెచ్చు తెలుగు కవిగా
పుట్టడం కన్న ఈ సముద్రతీరంలో పీతగా పుట్టినా బాగుండెది, ఈ కష్టాలు లేకపోను " అన్నారట.
శ్రీ శ్రీ " పీత కష్టాలు పీతవి ! " అని ఫిలాసఫించాడు.
** ** ** ** ** ** ** **
"జ్యోతి " ( 1963) సౌజన్యంతో........................

1 comment:

  1. శ్రీశ్రీ గారి కవిత్వాన్ని, హాస్యప్రియత్వాన్ని తలచుకొని ఆనందించడం ఓ గొప్ప అనుభవం. ఈనెల 30వ తేదీన మాబెజవాడలో శ్రీశ్రీ గారి విగ్రహావిష్కరణ ఉంది.

    ReplyDelete