Thursday, April 15, 2010

ముళ్లపూడి చమత్కారాల ముచ్చట్లు


ఈనాడు ’ఈనాడు’ చూడగానే "నవ్వండి..నవ్వించండి.. జీవించండి అన్న శీర్షికతో
ఒక ఆర్టికల్ కనిపించింది. దరహాసంతో మరో ఏడేళ్ళు ఆయుష్షు పెరుగుతుందని
అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసిందట. అందుకే మనకు రాజులకాలం నుంచి
వాళ్ళ ఆస్తానంలో విదూషకులు ఉండే వారు. క్రిష్ణ్దేవరాయల ఆస్తానంలో తెనాలి రామ
క్రిష్ణ కవి, అక్బర్ దగ్గర బీర్బల్ ఉండేవారని మనం చదివాం. ఇక మన తెలుగు సాహిత్యంలో
మొక్కపాటి,చిలకమర్తి,భమిడిపాటి మొదలయిన హాస్య రచయితలెందరో. ఆ కోవలో మనకు
మా చిన్ననాటి నుంచి ఈతరం పాఠకులను తన రచనల మాటల చమత్కారాలతో నవ్విస్తున్న
శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారి గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. నవ్వడం,నవ్వించడం
మరచిపోయిన మన తెలుగు వాళ్ళకి నవ్వడం నేర్పారు మన ముళ్లపూడి. ఆయన పేరు తలచు
కోగానే మనకు జ్ణాపకం వచ్చేది శ్రి బాపు గారి పేరు కూడా. వీళ్ళిద్దరిలో ఒకరు రాత కారుడు ఐతే
మరొకరు గీతకారుడు. ఐతే వీళ్ళిద్దరులోసాహిత్యంలో పైనుండేది ఎవరు అంటే చెప్పడం కష్టమే.
అలాకాకుండా ఉండే ఇంట్లో మాత్రం శ్రీ ముళ్లపూడి పైనుంటే శ్రీ బాపు క్రింద ఇంట్లో ఉంటారు. ఓ సారి
బాపుగారి ఇంటికి వెళితే ముళ్లపూడి వారు అక్కడికి వచ్చారు. మరోసారి రమణ గారి ఇంటికి వెళితే
బాపు గారక్కడకు వచ్చారు. అసలు ఎక్కడవున్నా మాలాంటి అభిమానుల గుండెల్లో మాత్రం కలకాలం
వాల్లిద్దరూ ఉంటారన్నది నిజం. ఆయన ఆంధ్ర పత్రికలో పని చేస్తున్నప్పుడు వ్రాసిన కధలకు శ్రీ బాపు
అందమైన బొమ్మలు వేసేవారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు రమణగారి మాటల్లో చమత్కారాలు
అడుగడుగునా అగుపిస్తాయి. అది ఓ సినిమా రివ్యూ అయినా సరే. ఉదాహరణకు "సువర్ణసుందరి" సిన్మాకు
ఆయన వ్రాసిన సమీక్ష మచ్చుకు....
.... బాక్సాఫీస్ సూత్రాల పెద్ద బాలశిక్ష అనవచ్చు. ఈ సూత్రాల కూర్పులో దర్శక నిర్మాతలు చూపిన
నేర్పును మెచ్చుకోవచ్చు.ఎందుకంటే మూడున్నర మైళ్ళు పొడవున్న ఈ చిత్ర గాధలో నడుస్తున్నప్పుడు
శ్రమ,విసుగు లేకుండా దారిలో బోలెడు మజిలీలున్నాయి. భారతీయ న్రుత్యాలు,బొంబాయి డాన్సులు
తెలుగు పాటలు, హిందీ గీతాలు, హాస్యం,దేశవాళీ రెడిండియన్ కోయవాళ్ళు,కొట్లాటలు,అట్టల బండలు,
వెదురు బుట్టల కొండలూ, ఇ.వి.సరోజ వేషంలో పార్వతీదేవి (చూశరా, ఆ చమత్కారం).......
ఈ రివ్యూ చదువుతుంటే నవ్వు,సుతి మెత్తని విమర్శ పాఠకుడికి ఏక కాలంలో ఆకలింపుకొస్తాయి!
ఇక ఆయన రాసిన ఋణాలందలహరిలో అప్పారావు ( నా పేరు వాడినందుకు ఈ సారి కలసినప్పుడు
ఓ ఫైవ్ అప్పడగాలి),రాధాగోపాలం ,బుడుగు,చిచ్చుల పిడుగు ఇలాఎన్నేన్నో.ఇక సిన్మా డైలాగులు,పాటలు
వాటిలో ఘాటుగా చుర్రుమనిపిస్తూ, నవ్వించి కవ్వించే చమత్కారాలు. ఆయన మితృలకు వ్రాసే ఉత్తరాల్లో
కూడా ఒక్క మాటతో నవ్విస్తారు. నాకు వ్రాసిన ఓ ఉత్తరం చూడండి. ఆయన సంతకంచేసి క్రింద బాపు
సంతకం కూడా అయనే పెట్టేసి బ్రాకెట్లో బాణం గుర్తుతో సహ ఆధరైజ్డ్ ఫోర్జరీ అని వ్రాసిన గడుసరి రమణగారు.
ఆయన వివిధ రచనలలో పలికించిన చనుకులను కొన్ని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆయన పూర్తి
సాహిత్యం (నవ్వితే నవ్వండితొ సహా) సాహితీ సర్వస్వం పేరిట విశలాంధ్ర ఎనిమిది వాల్యూములుగా ప్రచురించింది.
++ ++ ++ ++ ++ ++ ++
"తాతయ్యలకు బోల్డు ఆస్తి వుండును. దానిని వాళ్ళు మనుమలకు ఇచ్చెదరు.అంతవరకు మనము
అమ్మడిని పెళ్ళి చేసుకోరాదు అని అమ్మ చెప్పును" అంటూ పాపాయి(పద్మనాభం) పరిచయం.-దాగుడుమూతలు
** ** ** ** ** ** ** ** **
కంట్రాక్టరు( రావు గోపాలరావు) హలంతో :
’ఏంటి పిల్లా. ఆయన మీద పడ్డావ్. కళ్ళు మసకేశాయేటి.
హలం : కాదు.ఆయనే మన పాసెంజరనుకున్నాను.
కం : ఒళ్ళు కరుసయిపోతుంది జాగర్తమరి.సోమరాజు గాడికీ ఆడి
బావగారికీ నీకు డిఫరెన్సు తెల్డం లేదు.
హ: సోమరాజో కావరాజో, ఎంతమందిని గుర్తుపెట్టుకోను. ఒక్క చోట
నాలుగు రోజులు దూటీ ఎయ్యవు...............ముత్యాలముగ్గు.
** ** ** ** ** ** ** **
సోమరాజు (ముక్కామల) : ఇక్కడి కెందుకొచ్చావయ్యా.ఎవరన్నా జూస్తే కొంప
ములుగుతుంది.
కాంట్రాక్తరు (రావు గోపాలరావు) : కొంప ముంచడమే కదండీ మన కాంట్రాక్టూ !
** ** ** ** ** ** ** ** **
పిక్చరు తియ్యకుండా స్టోరీ ఏమిటండీ ! మీరు మరీ విట్టీగా మాటాడుతారు !
---విక్రమార్కుడి మార్కు సింహాసనం నుండి*
** ** ** ** ** ** ** ** **
"మంచోళ్ళు సెడ్డోళ్ళు అంటూ యిడిగా వుండరు మావా ! మంచీ చెడ్డా కలిస్తేనే మడిసి."
--------సాక్షి*
** ** ** ** ** ** ** ** ** **
రమణగారు వ్రాసిన ఋణాలందలహరి చదివితే ఆయనకు తెలుగు భాషపై ఉన్న పట్టు
తెల్స్తుంది. పదాలలో ఒక్క అక్షరం మార్చి దాఋణం,అఋణకిరణుడు, కఋణ అంటూ
’అప్పును" స్పురణకు తెచ్చారు. జంతువులకు కూడా ఆయన భాషను సృష్టించారు..కాకి
భాషను చూడండి. కావులించి,కావు కేకలు,రెక్కలో బాణం,కావురుబావురుమంటూ ఏడ
వడం,రెక్కాడితేగాని డొక్కాడని వాళ్లం,కాకమ్మ కబుర్లు, అలానే పాములూ వాటి భాషలోనే
ఎలా మాట్లాడతాయో చూడండి. తుసాబుసామంటూ,నాలికలు కొరుక్కొని, కోటికి ’పడగ’
లెత్తి ,దో’బుస్’లాడుకోడం,కడుపార గాలి భోంచేసి బుస్సున తేన్చడం, గాలి పుట్టలు కట్టడం,
చీమల భాషనూ పరికించండి.-చిమచిమ నవ్వు,పుట్టతీసి పుట్టమునగడం (మనం కొంపదీసి,
కొంప మునగడం అన్నట్టు). ఇలా ఆయన శైలి సాగిపోతుంది.
నా "సురేఖార్టూన్స్" పుస్తకానికి అయనతో ముందు మాట వ్రాయించుకొనే అద్రుష్టం కలిగింది.
అందులోని కొన్ని మాటలు---
.....చక్కని కార్టూన్ పుస్తకాలు చూడడం-అల్టిమేట్ జాయ్ ! దీనికి తోడు వెన్కనుంచి-విన-బడే-
గులాం పాట-----. చూసారా,ఇక్కడ ఆయన బడేగులాం పేరుకు వెనుకనుంచి వినబడే అనే మాటకు
ఎలా కలిపారో!
అందులోనే మరో చోట " మామూలు మాటల్లోంచి ఎడా-పెడా-ర్ధాలు తీసి-కుంచెడేసి నవ్వులు
పిండుతారు" అంటూ వ్రాసారు. ఇలా ఆయన రచనా చమత్ర్కుతిని ఎన్ని మాటల్లో నాలాంటి సామాన్యుడు
చెప్పగలడు.

2 comments:

  1. బావుందండి రమణ గారి చమతౄతి..చతురత అనాలేమొ:)

    అభిజ్ఞాన

    ReplyDelete
  2. రమణ గారిని గుర్తు చేసినందుకు కృతఙ్ఞతలండీ. నాకు బాపు-రమణలిద్దరూ ఇష్టమైనా రమణగారంటే బోల్డు కుంచం ఎక్కువ ఇష్టం. ఆయన రచనా శైలికి నేను దాసోహం అయిపోయాను. ఆయన రమణీయాలు ఎన్నిసార్లు చదివినా తనివితీరదు. సినీరమణీయం, సాహిత్య రమణీయం, కదంబ రమణీయం ....వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినీరమణీయం లో ఒక భాగం మూడో మిత్రుడు అక్కినేని నాగేస్వరరావు గారికి అంకితమిచ్చారు. ఆ పుస్తకం ఎంతో బాగుంటుంది. ఆయన చమక్కులు నాకు చాలా ఇష్టం. సాలూరి రాజేశ్వరరావుగారి గురించి రాస్తూ "స్వరాలూరి సాలూరి" అంటారు.నేను రమణగారిమీద ఒక టపా రాయాలని చాలారోజులనుండీ అనుకుంటూ ఉన్నాను, కాని కుదరట్లేదు. ఇవాళ మీ టపా చూసి చాలా సంతోషం కలిగింది. మరొకసారి ధన్యవాదాలు!

    ReplyDelete