Thursday, December 09, 2010

శ్రీ యమ్మెస్.రామారావు-మొదటి సినీనేపధ్యగాయకుడు !



హనుమాన్ చాలిసా, శ్రీ రామకధాగానం విన్న వారికి శ్రీ ఎమ్మెస్ రామారావుగారి
మధుర స్వరం కలకాలం వినిపిస్తూనే వుంటుంది. "శ్రీ హనుమానుల గురుదేవులు
నా యెద పలికిన సీతారామ కధా..నే పలికిన సీతారామకధ" అంటూ మధురంగా
గానం చేశారు రామారావు గారు. "సుందరదాసు" గా అభిమానులు ఆయనకు
బిరుదునిచ్చారు. శ్రీ రామారావు తెలుగు సినిమాలలో తొలి నేపధ్య గాయకుడిగా
ప్రవేశించారు. ఆ కాలంలో పాట పాడగలవారికే నటించే అవకాశం దొరికేది కాబట్టి
నేపధ్యగాయకుల అవసరం వుండేది కాదు. తరువాత కాలంలో చిత్రపరిశ్రమలో
వచ్చిన మార్పులతో రామారావు గారికి నేపధ్యగాయకుడిగా అవకాశం దొరికి
20 ఏళ్ళపాటు గాయకుడిగా కొనసాగి ఎన్నెన్నో మధుర గీతాలను ఆలపించారు.
తెనాలి తాలూకా, మోపర్రులో జూలై 3, 1921 న సీతారామారావు జన్మించారు.
గుంటూరు హిందూ కాలేజీలో చదువుకొనే రొజుల్లో అంతర కళాశాలల లలిత
సంగీత పోటీల్లో శ్రీ రామారావు మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఆనాటి
కార్యక్రమాలకు జడ్జిగా వచ్చిన అడవి బాపిరాజు సినిమాలలో ప్రయత్నించమని
ప్రోత్సహించారు. ప్రఖ్యత హిందీ గాయకుడు సైగల్ పాటలు పాడేవారు శ్రీ రామారావు.
ఆయన గొంతు కూడా సైగల్ స్వరాన్నిపోలివుందని మితృలు ప్రోత్సహించేవారు.
సముద్రాలతో పరిచయం వుండటం చేత ఆయన ద్వారా పరిశ్రమకు పరిచయమయ్యారు.
సి.ఆర్.సుబ్బరామన్ సంగీత దర్శకత్వం లో సముద్రాల వ్రాసిన కూలీలం, వల్లదంటే
కోపమా అన్న రెండు పాటలను శ్రీ రామారావు పాడగా ప్రవైట్ రికార్డుగా విడుదలయింది.
అటుతరువాత " దేవత " సినిమాలో "ఈ వసంతము నిత్యము కాదు..పూవు దొన్నెలో
తీయ తేనియ లేదు" అన్న పాటలను పాడారు. ప్రముఖ నిర్మాత కె.యస్.ప్రకాశరావు
తను నిర్మించి దర్శకత్వం వహించిన "ద్రోహి " చిత్రంలో (1948) లో జి.వరలక్ష్మితో కలసి
"ప్రెమేకదా" పాటను పాడారు.ఆచార్య ఆత్రేయ గీతం "పోరా బాబూ పో" (దీక్ష) ,తెలుగు,
తమిళ భాషల్లో పాడారు. రామారావు తెలుగుతో బాటు తమిళ, హిందీ (రామదాసు)లో
కూడా పాటలు పాడారు. పాండురంగ మహత్య్మం లో వేషమేయటమే కాకుండా పాటను
పాడారు. ఆనాటి హిరో సిహెచ్.నారాయణరావుకి రామారావుగారే ప్లేబ్యాక్ పాడేవారు.
తరువాత కాలంలో పోటీ పెరిగిపోవటం చేత రాజమండ్రి వచ్చి తన్నీరు బుల్లయ్యగారి
గురుకుల పాఠశాలలో ఉద్యోగంలో చేరారు. ప్రతి నెలా మా స్టేట్ బ్యాంకుకు పాఠశాల
జీతాల చెక్కు మార్చడానికి శ్రీ రామారావు వచ్చేవారు. అక్కౌంటెంట్ గా అప్పుడు
బ్యాంకులో పని చేస్తున్న నాకు ఆయనతో పరిచయ భాగ్యంకలిగింది. 1992 ఏప్రియల్
20 వ తేదీన యుద్ధకాండ గేయ రచన చేస్తూ ఆయన కన్నుమూయగా ఆయన రెండో
కుమారుడు శ్రీ నాగేశ్వరరావు పూర్తి చేశారు. శ్రీ రామారావుగారి మనువడు శ్రీ .శ్రీనివాస్
సుందరకాండ గానాన్ని ముమ్మూర్తులా తాతగారిలా గానం చేస్తున్నారు.

3 comments:

  1. అప్పారావు గారూ !
    తెలుగులో తొలి నేపథ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు గారి గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. I still remember those days, some 20 to 25 years back, M S Ramarao's records being played in the temples and this was a daily routine.At the time of exams also we use to stop preparing for exams and listen to the records during morning hours.
    He translated and composed Hanuman Chalisa into telugu so well that most of them think that the telugu hanuman chalisa is original.

    My husband sings few lines of M S Ramarao Hanuman Chalisa for our son at bedtime and is great fan of him.

    Thank you for giving all the details.

    Nagalakshmi Mattegunta
    Mumbai

    ReplyDelete
  3. తెలియని ఎన్నో మంచి విషయాలను తెలియజేసారు, ధన్యవాదములు.

    ReplyDelete