Saturday, December 18, 2010

రచయిత జర్నలిస్ట్ శ్రీ నండూరి రామమోహనరావు




1950-60 శకాలలో ఆంధ్రవారపత్రిక పాఠకులకు శ్రీ నండూరి రామమోహనరావు
పేరు తెలియని వారుండరు. ఆ రోజుల్లో శ్రీ నండూరి ఆంధ్రవారపత్రికలో పిల్లల
కోసం రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ " కాంచనద్వీపం" (TREASURE ISLAND)
మార్క్ ట్వేన్ "టామ్ సాయర్", హకల్ బెరీ ఫిన్", "రాజూ పేద " ,"విచిత్రవ్యక్తి "
(The Myysterious Stranger) అనువదించారు. తెలుగు మీడియంలో
చదువుకొన్న మేము అలా ప్రశిద్ధ ఆంగ్ల నవలలను తెలుగులో చదివే అవకాశం .
కలిగింది. ఆయన అనువాదం కూడా మరో భాష నుంచి తెనిగించినట్లు కాకుండా
తెలుగులో స్వయంగా వ్రాసిన రచనలానే వుండేది. ఆయన విశ్వాత్ముల
నరసింహమూర్తి గారు చిత్రించిన పంచతంత్రం బొమ్మల కధలకు, అటు
తరువాత బాపు గారు వేసిన "అసంప్రేక్ష్యకారిత్యం" బొమ్మల కధలకు
గేయ రచన చేశారు. దురదృష్టవశాత్తు నా దగ్గర అప్పటి ఫంచతంత్రం
బొమ్మల కధల పుస్తకం ( ఆంధ్రగ్రంధమాల ప్రచురణ) ఎవరో సంగ్రహించారు.
ఐనా మిత్రలాభం లో లేడి వేటగాడి వలలో చిక్కినప్పుడు మితృడు వాయసం
పాత్రకు " మేతకోసమై వలలో పడెనే పాపం పసివాడు" అంటూ శ్రీ నండూరి
వ్రాసిన గేయం ఇంకా నాకు గుర్తుంది..శ్రీ నండూరి ఖగోళ భౌతిక శాస్త్ర రచన
"విశ్వరూపం", మానవ పరిణామ శస్త్రగ్రంధం "నరావతారం" రచించారు.
ఆంధ్రజ్యొతి దిన పత్రికకు వ్రాసిన సంపాదకీయాలు సంకలన రూపంగా
వెలువడ్డాయి. శ్రీ నండూరి రామమోహనరావుగారు కృష్ణా జిల్లా ఆరుగొలనులో
1927, ఏప్రియలు 24 న జన్మించారు. నూజివీడు, మచిలీపట్నాలలో హైస్కూల్
చదువు, రాజమండ్రిలో కాలేజీ చదువు పూర్తి చేశారు. 1948 జనవరి నుండి
1960 జూన్ వరకు ఆంధ్రవారపత్రిక అటుతరువాత ఆంధ్రజ్యోతి పత్రికలలో
పనిచేశారు. అమెరికా, రష్యాలలో పర్యటించారు. శ్రీ రామమోహనరావు గారి
సోదరి శ్రీదేవిగారిని శ్రీ ముళ్లపూడి వివాహమాడారు. శ్రీ రామమోహనరావు గారికి
మీ అందరి తరఫున నమస్సుమాంజలి !

5 comments:

  1. నండూరివారు తర్జుమా చేసిన టాంసాయర్, హకల్బెరి ఫిన్, విచిత్ర వ్యక్తి, కాంచన ద్వీపం, తెలుగులో అద్భుతాలుగా వెలుగొందుతున్నాయి. పర భాష నుండి తెలుగులోకి తర్జుమా చెయ్యటం అంటే ఎలా ఉండాలి అన్న విషయం ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఆంగ్లంలో ఉన్న పదాలను పట్టుకుని, తెలుగులోకి యధాతధంగా పరమ వికారంగా తర్జుమా చేసే పండితులమనుకునేవారు, ఈయన తెలుగు చేసిన పుస్తకాలు చదువుకుని నేర్చుకోవాలి. ఆయన పుస్తకాలు చదివిన తరువాతే ఎవరికైనా పరభాష నుండి తర్జుమా చేసే అర్హత వస్తుంది అని చెప్పటంలో నెనేమీ వెనుకాడను.

    నా చిన్న తనంలో, మార్క్ ట్వైన్, ఆర్ ఎల్ స్టీవెన్సొన్ రచనలు తెలుగులో చదివినతరువాతే ఆంగ్లంలో చదివాను. ఇంకా ఆంగ్ల భాష నేర్చుకునే రోజుల్లో, తెలుగులో ముందుగానే చదివి ఉండటంవల్ల, ఆంగ్లంలో అంత సులభంగా అర్ధంకాని స్టీవెన్సన్ రచన కూడ అర్ధం చేసుకోగలగటం, నండూరి వారి అనువాదాల వల్లనే. ముఖ్యంగా స్టీవెన్సన్ పాత తరానికి చెందిన రచయిత. ఆయన రచనలలోని ఆంగ్లం, ఒకపట్టాన అర్ధం కాదు. గ్రాంధికానికి దగ్గరగా ఉంటుంది. అటువంటి ఆంగ్లం లోనుండి చక్కటి శైలితో, సులభమైన తెలుగులోకి అనువదించి, నండూరి రాంమోహన రావుగారు, ఆ పుస్తకం తెలుగులోనే వ్రాయబడిందేమో అనిపించేంత బాగా తెనుగీకరించారు. నoడూరి రాం మోహనరావుగారికివే నా అభినందనలు, కృతజ్ఞతలు, నమస్కారాలు

    ReplyDelete
  2. శివప్రసాద్ గారూ శుభోదయం,
    నండూరివారి గురించి మీరు నా కన్నా ఎంతో వివరంగా చెప్పారు.
    నా హృదయపూర్వక ధన్యవాదాలు. అనువాదం చదివి , ఆంగ్ల
    పుస్తకం చదివితే మన మనసులోకి వెనువెంటనే తెలుగు భావం
    వచ్చేస్తున్న మీ మాట నూరుపాళ్ళ నిజం!

    ReplyDelete
  3. నండూరి గారు అనువదించిన "టామ్ సాయర్ ప్రపంచ యాత్ర"( Tom sawyer abroad) పుస్తకాన్ని (ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం అనువదించారట) ఈ మధ్య హాసం పబ్లికేషన్స్ వాళ్ళు సంపాదించి మళ్ళీ వేశారు. చాలా చాలా బాగుంది. చదివారా మీలో ఎవరైనా?

    ReplyDelete
  4. టాంసాయర్, హకల్బెరి ఫిన్, విచిత్ర వ్యక్తి, కాంచన ద్వీపం నవలలు అనువాదాలు కాదు స్వతంత్ర్య రచనలే అన్నంత సరళంగా రాసిన నండూరి రామమోహనరావు గారికీ తెలుగు పాఠక లోకం ఋణపడి వుంది. ఈ నవలలు చదివినట్లుగానే ఆయన 'విశ్వదర్శనం ', ' నరావతారం ' కూడా అంతా ఆసక్తితో మళ్ళీ మళ్ళీ చదివించాయి ఆ రోజుల్లో ! కాల్పనిక నవలా సాహిత్యం రాజ్యమేలుతున్న కాలంలో విజ్ఞాన ధారావాహికలు ప్రచురించి విజయం సాధించిన రచయిత నండూరివారు. ఆయన సంపాదకీయాలు కూడా చాలా ఆసక్తికరంగా వుండేవి.
    ఆ మహానుభావుణ్ణి గుర్తు చేసిన సురేఖ గారికి, శివ గారికి ధన్యవాదాలు.

    ReplyDelete
  5. సుజాత గారూ, నిజమే! టామ్ సాయర్ ప్రపంచ యాత్ర
    పుస్తకాన్ని హాసం బుక్స్ వారు 2006 ఫిబ్రవరిలో
    ప్రచురించారు. ఈ పుస్తకం పునర్ముద్రణ పై శ్రీ నండూరి
    రామమోహనరావు తన హర్షాన్ని ప్రకటించారు. నా బుక్
    కలెక్షన్లలో ఈ పుస్తకం వుంది.

    ReplyDelete