Sunday, December 19, 2010

టామ్ సాయర్ ప్రపంచయాత్ర ( టామ్ సాయర్ ఎబ్రాడ్ )


శ్రీ నండూరి రామమోహనరావు గారి ఆంగ్లనవలానువాదం గురించి నిన్న
నేను చెప్పిన విషయాలకు మన బ్లాగరు మితృలనుంచి మంచి స్పందన
వచ్చింది. సుజాతగారు టామ్ సాయర్ ప్రపంచయాత్ర గురించి గుర్తు చేశారు.
హాసం ప్రచురణలు ప్రచురించిన ఆ పుస్తకంలో శ్రీ నండూరి రామమోహనరావు
ముందు మాటగా చెప్పిన ""రచయిత మాట" మీ కోసం .
<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఒకప్పుడు మనతో బాగా సన్నిహితంగా వుండి, తర్వాత ఏళ్ళతరబడి కనబడకుండా
పోయిన చిన్ననాటి స్నేహితుడు హఠాత్తుగా ఏ రోడ్డుమీదో ఎదురుపడితే ఎలా వుంటుంది?
సరిగా అలాగే అయింది నా పరిస్ఠితి. చాలాకాలంగా నేను రాశాననే జ్ఞాపకం కూడా
మిగలకుండా పోయిన "టామ్సాయర్ ప్రపంచయాత్ర" అనువాద నవలను సీరియల్ గా
ప్రచురించిన ఆంధ్రవార పత్రిక కటింగ్స్ ను తాను ఒక చోట సంపాదించానని మిత్రులు
శ్రీ ఎమ్భియస్ ప్రసాద్ కొన్నాళ్ల క్రిందట చెప్పగానే వృద్దాప్యం వల్ల ఓపిక లేక ఎగిరి
గంతు వెయ్యలేదు గాని, మానసికంగా అంత పనీ చేశాను.
ఏనాటి మాట ? "టామ్ సాయర్ ప్రపంచయాత్ర" సీరియల్ ప్రచురణ 1955లో
జరిగిందని ప్రసాద్ గారు చెప్పారు. మొత్తంపై ఒక" లాంగ్ లాస్ట్ ఫ్రెండ్" మళ్ళీ
కనిపించినట్టయింది. ఆ రోజుల్లోనే ఒక సారి పుస్తకరూపంలో వచ్చింది కూడా.
నెమ్మదినెమ్మదిగా అదీ అంతర్ధానమై పోయింది. కొంతకాలం దానికోసం వెంపర్లాడాను,
కాని ఫలితం లేక వూరుకున్నాను. ఇన్నాళ్ల తరవాత ప్రసాద్ గారికి అది దొరకడం
దాన్ని తమ "హాసం" ప్రచురణలలో ఒకటిగా ప్రచురించడానికి ఆయన నిశ్చయించడం
ఎంతో సంతోషంగా వుంది.. ఇందుకు ఆయనకీ, ప్రచురణకర్త శ్రీ వరప్రసాదరెడ్డి గారికీ
నా ధన్యవాదాలు.
మార్క ట్వేన్ నవలల నా అనువాదాలు గడచిన 50-60 ఏళ్ళలో ఏడెనిమిది
సార్లయినా పునర్ముద్రణ జరిగి వుంటాయి. నన్ను ఇప్పటికీ కొందరు వృద్ధులు
( ప్రముఖులు కూడా ) టామ్సాయర్,హకల్బేరీఫిన్,రాజూ పేదా నవలల అనువాదకుడిగానే
ప్రశంసా పూర్వకంగా గుర్తు పెట్టుకోవడం, ఇతరులతో చెప్పడం తరచుగా జరుగుతూ
వుంటుంది. అదికూడా ఈ "టామ్ సాయర్ ప్రపంచయాత్ర" పునర్ముద్రణ పట్ల నేను
ఉత్సుకత చూపించడానికి ఒక కారణం.ఏమైనా చాలాకాలంగా అలభ్యమై, ఇప్పుడు
పునర్ముద్రణ పొందుతున్న ఈ పుస్తకం పూర్వపు నా మార్కట్వైన్ ఇతర అనువాదాల
లాగానే పాఠకాదరణ పొందగలదని ఆశిస్తున్నాను.
విజయవాడ
ఫిబ్రవరి, 2006 నండూరి రామమోహనరావు

1 comment:

  1. అప్పారావుగారూ, ఈ పుస్తకం గురించి నాకు అస్సలు తెలియదు. పున:ప్రచురణ జరిగినట్టూ తెలియదు. తెలియచెప్పిన మీకు నా ధన్యవాదాలు. హాసం ప్రచురణలు వారు ప్రచురించారాని చెప్తున్నారు. మరి రేపు విజయవాడలో జరగబోయ్యే పుస్తక ప్రదర్శనలో దొరుకుతుందేమో చూడాలి. మీరు కొని ఎన్నాళ్ళు అయ్యింది, ఇప్పుడు ఈ పుస్తకం అందుబాటులో ఉన్నదా తెలియచేయగలరు.

    ReplyDelete