Thursday, March 31, 2011

మన పత్రికలు- హెడ్డింగులూ -"తల"రాతలూ !



ఈ రోజు ఆంధ్రజ్యొతి దినపత్రిక తెరవగానే లోపలి పేజీలో "బాపూ పుస్తకంపై
నిషేధం?" అన్న వార్త అగుపించింది. అదేమిటి బాపుగారి పుస్తకాల్లోని
బొమ్మలు నవ్విస్తాయి మరెందుకీ నిషేధం అని ఆశ్చర్యపడి లేచి విషయం
చదివాక అమ్మయ్యా ! ఇదా సంగతి అని కుదుటపడ్డాను.
ఎవరో విదేశీపెద్దమనిషి గాంధీ గారి మీద అవాకులు చెవాకులు
రాశాడట. బ్రతికిపోయాం! ఆ గాంధి మీద వ్రాశాడు, ఈ గాంధీలమీద
వ్రాసుంటే ఇప్పటికి ఎన్ని బస్సులు కాలిపోయేవో ! ఎన్ని బందులు
రాస్తా రోకోలు జరిగేవో !!
పేపరు తీస్తే, అదే నండి మన వార్తాపత్రికలు చదివితే అన్నీ హత్యలూ,
ఆత్మహత్యలు, దోపిడీలూ ,త్రీపిడీలూ, నిన్నలూ ,రేపులూ కోకొల్లలు !! కానీ
ఆ వార్తలూ ఒక్కోసారి చదివితే నవ్వు వస్తుంది. ఎలాగో చిత్తగించండి.
ఈ మధ్యే ఒక హెడ్డింగ్:
" రైతు ఆత్మ హత్యలకు రెండు కోట్లు "
ఈ మాట చదవగానే ఏమిటి, ఆత్మ హత్య చేసుకోడానికి ప్రభుత్వం రెండు
కోట్లు ఇస్తున్నదా అనిపిస్తుంది. ఇక మరో వాక్యం:
"ఆత్మహత్య చేసుకొన్న యువకుడి మృతి"
ఆత్మ హత్య అంటేనే చనిపోయాడని అర్ధం. ఇక చేసుకొన్నవ్యక్తిని వీళ్ళు
మరోసారి చంపేశారన్నమాట!
చాలా ఏళ్ళ క్రితం ఇంగ్లీషు పేపర్లలో తరచు ఈ మాటలు అగుపించేవి
MGR BACKS INDIRA
OPPOSITION'S MOTION IN PARLAMENT.

ఇవి చదువుకొని నవ్వుకొనే వాళ్ళం! కొన్ని వినటానికి అదోలా వుంటాయి.
అన్ని శీర్షికలూ అలానే వుంటాయి అనలేం!ఒక పత్రిక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి
వ్రాస్తూ " స్టేట్ బ్లాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" అన్న పతాక శీర్షిక వుంచింది.
అలానే గనుల దోపిడీని "గనుల ఘనులు" అని వ్రాసారు. బొగ్గు గనుల్లోని
దగాకు కోల్ మాల్ ( గొల్ మాల్ ) అని వ్రాయటం సీరియస్ విశేషాలకు
వ్యంగ్యాన్ని జోడించడం పాఠకులను ఆకర్షించడానికి జర్నలిజమ్ లో
కొత్త ప్రయోగాలు. వివాహ ప్రకటనలు కూడా ఈ మధ్య " 50వ వివాహ
వోత్సవమ్" అని వేస్తున్నారు. ఆ తప్పు అటుతరువాత మార్చారు.
మా చిన్నతనంలో వచ్చిన కొన్ని పత్రికల పేర్లు కూడా తమాషాగా
వుండేవి. గుండుసూది,ఢంకా, కాగడా, చిత్రగుప్త మొదలైనవి. ఆ రోజుల్లో
డిటెక్టివ్, అపరాధపరిశోధన పేర్లతో పత్రికలు వచ్చేవి. కొమ్మూరి సాంబశివరావు
సంపాదకత్వంలో తెలుగు సినిమా అనే సినిమా మాస పత్రిక వచ్చేది.

2 comments:

  1. దోపిడీలూ ,త్రీపిడీలూ

    :D

    ReplyDelete
  2. "బాపు పుస్తకంపై నిషేధం" ఒక్క క్షణం మీరూ ఖంగారు పెట్టేసారు కదండీ. :)

    హెడ్ లైన్లలో ప్రాస కోసం పత్రికలు ఒక్కోసారి మరీ దారుణంగా భాషను ఖూనీ చేసేస్తున్నాయి లెండి.
    టీవీ వాళ్ళ భాష అయితే చెప్పనే అక్ఖర్లేదు. పదం బావుంటే అర్ధం తో పనిలేకుండా ప్రాస కోసం వాడేస్తారు.

    మొన్నామధ్య ఏదో ఛానెల్లో బూచాడులా ఉన్న ఓ యాంకర్ క్రైం న్యూస్ చెబుతూ " పాపం.. మతి లేని ఆ అమాయకురాలిని చంపిన వెంటనే హతుడు ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తీసుకుని జెండా ఎత్తేశాడు" అన్నాడు. ఇహ మీరే అర్ధం చేసుకోండి ఆ వాక్యాన్ని. :)

    ReplyDelete