Saturday, April 16, 2011

ఆమ్యామ్యా!!



బాపురమణల అందాలరాముడులో రాజబాబుతో రమణగారు పలికించిన
డైలాగు గుర్తుందా! లంచానికి బహు చక్కని నామకరణం చేసి అమ్యామ్యా
పదాన్ని పాప్యులర్ చేసారు, రమణగారు. అంతకుముందు లంచానికి బరువు
పెట్టడం అనీ, దక్షిణ ఇవ్వడమనీ,( చూశారా గమ్మత్తు ఇక్కడ "మనీ" అన్న
మాట చేరింది!),చేయి తడపడమనీ, ఫార్మాలటీస్ అనీ ఎన్నెన్నో నామధేయాలు
వుండేవి. ఇక లంచాలపై భారతీయుడు, ఠాకూర్ లాంటి సినిమాలూ వచ్చాయి.
లంచావతారాలు కూడా సకుటుంబ సమేతంగా ఆ సినిమాలు చూసి చప్పట్లు
కొట్టేశారు. లేక పోతే ఆ సిన్మాలు అంత విజయవంత మయ్యేవా? ఐనా ఆ
లంచావతారాలు కూడా "లంచం" ద్వారానే ఆ సినిమాలు చూసి వుంటారు.
అంటే టిక్కెట్టు కొనకుండా అన్నమాట. అన్నాహజారే దీక్షతో మరోసారి
అవినీతి పై జనాల్లో కదలిక వచ్చింది. కొందరి దృష్టిలో అవినీతిపనులు
అవి నీతి పనులుగానే కనిపిస్తాయి. ప్రతి రోజూ ఏసీబీ వాళ్ళు వల వేసి పట్టు
కున్నారు అని పేపర్లలో, టీవీల్లో చదువుతూ చూస్తుంటాము కానీ, అసలు
అవినీతిని పట్టుకోడానికి ఇలా వలలూ గట్రా వెయ్యాలంటారా? ఏ గవర్నమెంటు
ఆఫీసుకెళ్ళి నుంచున్నాకోకొల్లలుగా అవినీతి కనిపిస్తూనే వుంటుంది.
(అ)ధర్మాసుపత్రుల్లో గేటులోంచి లోపలికి వెళ్ళడానికి దగ్గర నుంచి రోగి
మంచానికీ లంచం ఇవ్వాల్సిందే! పొరబాటున బాగుపడి బయటికి వెళ్లడానికి,
లేకపోతే "పోతే"బయటకు తీసుకువెళ్ళడానికీ లంచాలు ఇవ్వాల్సిందే!
దేముడినీ మన వాళ్ళు వదలిపెట్టడం లేదు. పెద్దపెద్ద గుళ్లల్లో క్యూలో
ముందరిగా దర్శనం చేసుకోవాలంటే ముందు గుడి ఉద్యోగులకు ముడుపులు
చెల్లించుకోవాలి. ఆ తరువాతే దేముడి ముడుపులు. పాలిటిక్స్ కోసం అనడం
లేదు కాని ఇంతకుముందు ప్రభుత్వంలో సింహాద్రి సత్యనారాయణ అనే మంత్రి
గారు వుండే వారు. ఆయన స్వయంగా ఓ సామాన్యుడిలా తిరుమల క్యూలదగ్గరికి
వెళ్ళితే ఆయన్నీ లంచం అడిగాట ఓ ఉద్యోగి. రాజమండ్రిలో 2003లో పుష్కరాలు
జరిగినప్పుడు ఆయన స్వయంగా క్యూల దగ్గర నిలబడి ప్రజలకు సహకారాన్ని
అందించారు. ఇప్పుడు అలాటి నాయకులు ఎంతమంది అగుపిస్తున్నారు.ఇప్పుడు
దేవాదాయ శాఖకు మంత్రేలేడట!!
అసలు ఉద్యోగులకు లంచాలు నేర్పింది మనమే నేమో అనిపిస్తుంది.
ఫోలీసువాళ్ళు లైసెన్సులు చెక్ చేస్తున్నప్పుడు మన దగ్గర అవి వుండవు.
వెంటనే కేసు రాయకుండా మనమే వాళ్లకు లంచం ఆఫర్ చేస్తుంటాము. అలా
లంచం ఇచ్చే బదులు ఆ కాగితాలు దగ్గర వుంచుకోవచ్చుగదా! వుంచుకోరు.!
కొతమందికి అదో ప్రెస్టేజ్! బైకులకు నెంబరు ప్లేటుండదు! దానిమీదఏవేవో
నానా రాతలూ వ్రాసివుంటాయి. అన్నహాజరేకు మద్దతు తెలుపుతూ రాలీలు
జరపడం కాదు. ముందు ఇటువంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా చూడాలి.
అప్పుడే అవినీతి లేని సమాజం మనకు వస్తుంది. మన పిల్లలను ఏదైనా
పని చేసి పెట్టమని అడుగుతూ ఆ పని చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా అనడం కూడా
వాళ్ళకు చిన్నప్పటి నుంచే లంచాలు నేర్పడమేనన్నమాట. చెప్పిన మాట
వింటె శ్రీరాముడు, హనుమంతుడు లాంటి మంచి పేరొస్తుంది అని చెప్పాలి.
ఆ దేముళ్ళ బొమ్మల కధలు చూపిస్తూ వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళో చెప్పాలి.
అప్పుడే భావితరంలో నీతిమంతుల రాజ్యం వస్తుంది. లేకపొతే మనకివచ్చేది
అంతా "రాజా"ల రాజ్యమే!!

6 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Surekhaajee!

    Your cartoons are excellent. Yes we,the People of India are responsible for the corruption in the Country. When all of us do not try to find short cuts for our work to be done and ready to bear the delay and inconvenience if we follow the rules, corruption will fizzle out.

    ReplyDelete
  3. మీ ఈ పోస్ట్ కి కామెంట్ పెడతా సరే, నాకేంటి?...... అహ నాకేంటని? (ఇదిగో... మీరు బల్లకింద అరచేతి కేసి చూడట్లేదు :)...కాస్త చూసి చెప్పండి )

    ReplyDelete
  4. శంకర్ గారు, అవునూ మీరు బల్లక్రింద చేయి పెట్టారు సరే! కానీ నాకు హస్తసాముద్రికం
    చూడ్డం రాదే ?!

    ReplyDelete
  5. కాస్త "దక్షిణ" ఇస్తే అదీ నేర్పించేస్తా. దాంతో పాటు పనవటం లేదన్న మనసులో బరువు తగ్గాలంటే బల్లకింద చేతిలో బరువు పెట్టాలన్న వాస్తు సూత్రం కూడా ఫ్రీ..... ఫ్రీ...... ఫ్రీ :) :) :)

    ReplyDelete
  6. రెండూ చాలా బాగున్నాయండి :)

    'బల్లకింది చేతులూ చాలా పాతకాలం జోకు, ఇపుడంతా డైరెక్టే అని మా యాద్గిరి ఇలా స్పందించాడు:

    "భయ్ ఇలా బల్లకింద చేతుల్ వెట్టి దేవులాడి పకడ్నేకి పరెషాన్ చేస్తున్రు? వదులుర్రి. పైనే ఇవ్వుర్రి, కావాలంటే ఫోటో తీసుకోన్రి, పత్రికల్లో మంచిగేసుకోన్రి. ముక్కు మంత్రి మావోడే, పెదానమంత్రి మావోడే, బంగారమ్మ ఏంజెబితే అదే రూల్ గదే న్యాయం, సమజ్ అయ్యిందా?"

    ReplyDelete