Saturday, April 23, 2011

సరస్వతీ నమస్త్యుభ్యం






ఈ రోజు పుస్తకప్రియులకు అసలైన పండుగ రోజు .పుస్తకాలను ఆరాధించే వారికి
పుస్తకాలయాలు , అవి గ్రంధాలయాలయినా , పుస్తక విక్రయ కేంద్రాలయినా
నిజమైన దేవాళయాలు! 23 ఏప్రియల్ "వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ డే" గా ప్రపంచ
వ్యాప్త పుస్తకాబిమానులు జరుపుకుంటారు. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే
విపరీతమైన ఇష్టం. ఈ అభిరుచి నాకు మా నాన్నగారు నేర్పారు. అలా మానాన్న
గారు కొన్న పుస్తకాలు , నాకు పుట్టిన రోజు కానుకలుగా మా పిల్లలు ఇచ్చే పుస్తకాలతో
బాటు,నేను కొన్నవాటితో నా దగ్గర చాలా మంచి లైబ్రరీ వుంది. మా ఇంట్లోకి ప్రవేశించగానే
మొట్టమొదట అగుపించేవి నా పుస్తకాలే. .


83ఏళ్ళ చరిత్ర గల న్యూయార్కులోని స్ట్రాండ్ బుక్ స్టోర్ ఐదంతస్తుల భవనంలో
ఎటుచూసినా పుస్తకాలే అగుపిస్తాయట! ఈ పుస్తక దుకాణాన్ని రోజూ ఆరువేల పైగా
పుస్తకప్రియులు సందర్శిస్తారట!! పెద్దనగరాల్లో "పేజెస్" లాంటి పెద్ద పుస్తక విక్రయ
కేంద్రాలు వివిధరకాల పుస్తకాలను పాఠకులకు అందిస్తున్నాయి.
పుస్తకాల గురించి ఆరుద్ర గారు ఇంటింటి పజ్యాలలో ఇలా చెప్పారు:
ఎరువిచ్చిన పుస్తకాలు
ఎప్పుడూ తిరిగే త్రిపాది నక్షత్రాలు
ఆనందమూర్తి దగ్గర్నుంచి రాంబాబు పట్టుకెళితే
ఆయన దగ్గర నుంచి రంగయ్య తీసుకొన్నది
అక్షరాలా ఆదిలో నువ్వు కొన్నది
ఆ బుక్కు వాళ్ళింట్లో చూసినప్పుడు
నువ్వేం బాధపడకు
అయిదు నిముషాలసేపైనా కళ్ళారా
చూడగలిగావు కడకు
ఎరువిచ్చిన బుక్కు
మళ్ళీ చూడ్డంకూడా గొప్ప లక్కు !
<><><><><><><><><><><><><><><>


విజయవాడలో జరిగిన ఓ పుస్తకాల పండుగలో శ్రీ ముళ్లపూడి వెంకట రమణ చేసిన
మాటల ముత్యాల ప్రసంగంలో రాలిన కొన్ని ఆణిముత్యాలు.............
కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధానులు చదువుకోసమని తన కొడుక్కి
డబ్బులిస్తాడు ఆ వెంకటేశం ఆ డబ్బుతో పుస్తకాలు కొందాం అన్నాడు.
దాంతో గిరీశం షాకైపోయాడు.
"మైగాడ్ ! బయింగ్ బుక్సా! పుస్తకాలు కొనడమా?? ధిక్ ధిక్! ఇటీజ్ వర్స్ దాన్
సెల్లింగ్ గరళ్స్-అనగా పిల్లనమ్ముకోడంకన్నా కనిష్టం" అన్నాడు.
అదే గిరీశం చేత రమణగారు ఇల్లాను చెప్పించారు!
బుక్ రీడింగ్ పెరిగినది-మంచి బుక్స్ వల్లనే కాదు. ఈనాటి టీవీల్లో బంకజోళ్ళ
సీరియళ్ళ దయవళ్ళ..ట్ట!
పూర్వం బస్సొచ్చి బళ్ళను కొట్టింది.రైళ్ళొచ్చి బస్సులను కొట్టాయి. నాటకాన్ని
సినిమా కొట్టింది సినిమాని టీవీ కొట్టింది.కానీ బుక్స్ ని ఏదీ కొట్టలేదు.కొట్టబోదు
నా చిన్నప్పుడూ-నేను వయసు మీదున్నప్పుడూ-నేడు వయసు నా మీదున్నప్పుడూ-
ఎప్పుడూ ఆ దృశ్యాలు నా మనసులో పటంకట్టి వుంటాయి.ఒక దృశ్యం-ఒక బాపు బొమ్మ
గుమ్మంలో ముగ్గు వేస్తున్నది.రెండోది, ఒక చదువరి పుస్తకం చదువుతున్న చిత్రం.రెండుకి
రెండూ ఎంత చూసినా తనివితీరని గొప్ప చిత్రాలు. బంతిపూల రధంలాంటి బాపుబొమ్మ
గొబ్బెమ్మ దగ్గర మోకరిల్లి ముగ్గులు రచిస్తుంది. ఆ సొగసు చూడతరమా! వహవ్ వా!!
ఇంతకన్నా ఆనందమేమి? ..ఉంది..మహప్రభో..ఉంది.దీనిన మించిన భువన మోహన
దృశ్యం మరొక్కటి వుంది. అది ఒక చదువరి -చేతిలో తెరచిన పుస్తకం !
అప్పట్లో పబ్లిషర్లను కృతిభర్తలు అనేవారు..నన్నయ తర్వాత మధురకవి పోతన్నగారిని
ఒక రాజు అడిగాడు కాని ఆయన వద్దన్నారు. పోతన తన భాగవతానికి శ్రీరామచంద్రుడినే
పబ్లిషరుగా ఎన్నుకొన్నాడు.
దరిమిలా తాటాకులదశ దాటాక,యంత్రాలు వచ్చాక పబ్లిషర్ల సంఖ్య పెరిగింది.
ఆంధ్రప్రచారిణి,ఆంధ్ర గ్రంధమాల,వావిళ్ళ,విజయనగర,పిఠాపుర సంస్థానాలు,త్రివేణి,విశాలాంధ్ర,
ప్రజాశక్తి,ఎమెస్కో, నవోదయ-1 & 2, నవభారత్, న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్,నవజ్యోతి,
కొండపల్లి, కాళహస్తి,రామా, వెంకటరామా,అశోక్,ఠాగూర్,సాహిత్య అకాడమీలు...ఇలా ఎన్నెన్నో,
ఈ అఖండ పుస్తకజ్యోతికి...
ఇదే ఈ అక్షర నీరాజనం.
శ్రీ ముళ్లపూడి ప్రసంగ పాఠం నుండి
<><><><><><><><>
" E" అక్షరం ఉపయోగించకుండా నవలా రచన !!
ఎర్నెస్ట్ విన్సెంట్ కాల్పనిక నవల, "గాడ్విబ్" ను ఇంగ్లీషు అక్షరం "E" ని
ఉపయోగించకుండా 50,110 మాటలతో రచించాడు. "E" అనే అక్షరం
లేకుండా రాసిన ఈ నవల వ్రాయడానికి రచయితకు 165 రోజులు పట్టిందట!
మొదట 1939లో అమెరికాలో ప్రచురించినప్పుడు ఈ పుస్తకం ధర 3 డాలర్లు.
ఇప్పుడు ఈ పుస్తకం ధర $1000 !!
( మనమీదేనర్రోయ్! కార్టూన్ మితృలు శ్రీ సరసి గారి సౌజన్యంతో,
బాపూగారి బొమ్మాయిల బొమ్మకర్టసీ: బాపు చిత్రకళా ప్రదర్శన (1974)సావనీర్)

1 comment:

  1. Kritibharta ante granthaanni Ankitam teesukunnavaadu. Publisher nu Kritibharta anaru anukuntaa sir!

    ReplyDelete