Tuesday, April 05, 2011

రెండు రూపాయి నోట్ల కధ !!





ఈ రోజుల్లో రూపాయంటే అసలు విలువే లేదు కానీ ఆ రోజుల్లో రూపాయంటే
ఎంతో విలువ వుండేది. ఒక రూపాయి నోట్ల కొత్త సెక్షన్ కోసం బ్యాంకులో
కస్టమర్సు అడుగుతూ వుండే వారు. రిజర్వు బ్యాంకు నుంచి మా స్టేట్ బ్యాంకుకు
రెమిటెన్సు రాగానే కొత్త రూపాయినోట్ల కోసం మేమే ఆత్రంగా తీసుకొనే వాళ్ళం.
ఇప్పుడు ఆ ఒకరూపాయి నోట్లు రావటం లేదు వచ్చినా ఎవరూ ఆడిగే వాళ్ళూ
వుండరు!
మన దేశంలో క్రీస్తు పూర్వం 600 నుండే వెండి నాణేలను పురాణాలు,కర్ష పణాలు,
పణాలు అని పిలిచే వారట. రూపాయి అనే పేరు వెండి నాణెం నుంచే వచ్చింది.
సంస్కృతంలో "రూప్యకం" అంటే వెండి నాణెం అని అర్ధం. ఢిల్లీని 1540 నుండి
1545 వరకు పాలించిన షేర్షా వెండి నాణేన్ని రూపాయి పేరుతో విడుదల చేశాడు.
షేర్షా విడుదల చేసిన వెండి నాణెం బరువు సుమారు మ్11.34 గ్రాములుండేదట.
ఆప్పుడు రూపాయికి పదహారు అణాలు.1957 లో (నయా) పైసలు ప్రవేశపెట్టాక
రూపాయికి వంద పైసలుగా విభజించారు. మన దేశంలో మొదటిసారిగా కాగితం
నోట్లను బ్యాంక్ ఆఫ్ హిందుస్తాన్ (1770-1832), ది జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్
అండ్ బీహార్ (1773-75),బెంగాల్ బ్యాంకు (1784-91) ముద్రించాయి. బ్యాంకు
ఆఫ్ బెంగాలు నోట్లు మొదట ఒక వైపునే అచ్చయ్యేవి! అటు తరువాత రెండు
వైపులా ముద్రించడం ప్రారంభించారు. బ్యాంకుల స్థానంలో ప్రభుత్వమే కరెన్సీ
నోట్లను విడుదలచేయడం 1861 లో మొదలయింది. బ్రిటిష్ పాలనలో మొదటి
నోటు విక్టోరియా రాణి బొమ్మతో పది రూపాయల నోటు వచ్చింది.
మన దేశంలో మొట్టమొదటి కరెన్సీ నోట్లు ముద్రించే ప్రెస్ 1928 లో నాసిక్
లో నిర్మించారు. నాణేలను తయారు చేసే టంకశాలలు (మింట్) ముంబై,కోల్ కత్తా,
హైదరాబాదు, నోయిడాల్లో వున్నాయి. కలకత్తా మింట్ 1959లో ప్రారంభించగా
హైదరాబదు మింట్ 1903 ప్రారంభించారు.
మీరు ఇక్కడ చూస్తున్న రూపాయి నోట్లు 1917, 1935,1986 సంవత్సరాలవి.
1917, 1935 రూపాయి నోట్లు మా నాన్నగారు సేకరించినవి. ఈ నోట్ల గురించి ఒక
సంఘటన మీతో పంచుకుంటున్నాను. ఒకసారి ఈ రెండు నోట్లను బ్యాంకుకు
తీసుకొని వెళ్ళి మా బ్రాంచి మేనేజరుకు గొప్పగా చూపించాను. తరువాత ఆ రెండు
నోట్లు ఆయన టేబిల్ దగ్గర మిస్సయ్యాయి. ఎంత వెదికినా అగుపించలేదు. నా
కంటె ఆయనే ఎక్కువ బాధ పడ్డారు. ఇంటికి వేళ్లాక నాన్నగారికి ఎలా చెప్పాలో
తెలియలేదు. ఉదయం బ్యాంకుకు తీసుకు వెల్తునప్పుడే జాగ్రత్త అని మరి మరీ
చెప్పారు. నా అదృష్టం కొద్దీ ఆయన ఆ విషయం ఆడగలేదు. అలా రెండేళ్ళు
గడిచాయి .ఒక రోజు ఓచెక్కు కలెక్షన్ వివరాలకోసం రికార్డు రూము నుంచి
పాత రిజిస్టర్ తెప్పించి చూస్తుండగా ఆ పుస్తకంలో ఆ రెండు నోట్లూ ప్రత్యక్షమయ్యాయి.
అంటే ఆ రోజున బి.యమ్ టేబుల్ పై నున్న ఆ పుస్తకంలో ఆ రెండు నోట్లు పొరబాటున
వుండిపోయాయన్నమాట. ఆ విషయం తెలుసుకొన్న మా బ్రాంచి మేనేజరు "మీ
నాన్నగారి కష్టార్జితం కాబట్టి ఇంతకాలమైన తరువాత తిరిగి మళ్ళీ నీకే దొరికాయి"
అన్నారు. ఆ రాత్రి బ్యాంక్ నుంచి ఇంటికి వేళ్ళాక నాన్న గారికి ఈ వింత కధ
చెప్పాను. ఆయన ఓ చిరు నవ్వు నవ్వారు. ఆయనా మా .స్టేట్ బ్యాంకులో ఆఫీసరుగా
పని చేసి రిటైరయ్యారు. ఇలాటి సంఘటనలతోనే దేముడు న్నాడని నేను నమ్ము
తాను. ఇదండీ నా రూపాయి నోట్ల కధ!

3 comments:

  1. ఇక్కడో పొరబాటు చేశాను. చివర చూపించిన రూపాయి నోటు విడుదలయింది
    1951లో.పొరబాటున 1986 అని వ్రాశాను.దయచేసి గమనించగలరు.

    ReplyDelete
  2. రూపాయు కథ భలే వుందండి. ఎలా వున్న రూపాయి ఇంతలా చిక్కిపోయింది! :( 1951 రూపాయి ఎప్పుడో ఎక్కడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు. నికెల్ రెండు పైసలు, పదిపైసలు ఎపుడైనా చూస్తే ముచ్చటేసేది. ఎక్కడికెళ్ళి పోయాయో! అలాగే బంగరురంగు 20పైసలు డెబ్భైల్లో విడుదలయి త్వరలోనే కనుమరుగైపోయింది.

    ReplyDelete
  3. విలువైన విలువలకు విలువలేదుకదా?
    కేవలం పది రూపాయల నోటు ఇప్పటి
    వందరూపాయలకన్నా పెద్దదేమో
    అప్పుడు....బాగా వ్రాసారు..

    ReplyDelete