Tuesday, April 12, 2011

శ్రీరామ కధ





తెలుగువాళ్ళ ఆరాధ్యదైవం శ్రీరాముడు. ఎంత చిన్న ఊరైనా రామాలయం
తప్పక వుండి తీరుతుంది. ఈ కాలంలో ఎక్కువమంది సాయి భక్తులున్నా
వారుకూడా సాయిరాం అని ఒకరినొకరు పలకరించుకుంటూనే వుంటారు.
అదే రాముని పేరులోని మహిమ. మనం కూడా ఏది వ్రాయటం మొదలు
పెట్టినా శ్రీరామ చుట్టకుండా ప్రారంభించం! బాపు రమణ గార్లు శ్రీరామ
భక్తులని తెలుసుగా. రమణగారైతే కవరు మీద వ్రాసే ఎడ్రెస్ పైభాగాన
కూడా శ్రీరామ అని తప్పక వ్రాస్తారు. శ్రీ బాపు ఆయన ఇష్టదైవం రాముడు
చిత్రాలు ఎన్నోగీశారు. అందులో శ్రీరాముడు సీత పాదాలకు పారాణి అద్దుతున్న
అపురూప చిత్రంలో తానే రంగులను రాముడికి అందిస్తున్నట్లుగా ,తనను
ఆంజనేయస్వామిగా ఊహించుకొని గీసిన చిత్రం ఎన్నిసారు చూచినా తనివి
తీరదు. ఇక రమణగారు రాసి, బాపుగారు తీసిన ప్రతి సాంఘికచిత్రంలోనూ
రామాయణ చాయలు తప్పక కనిపించి తీరుతాయి. ఇందుకు ముత్యాల
ముగ్గు, కలియుగ రావణాసురుడు,రాంబంటు,అందాలరాముడు,సుందరకాండ
చిత్రాలే ఉదాహరణ. ఇక రాముడిపై సంపూర్ణరామాయణం,సీతాకళ్యాణం,
శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాలను నిర్మించారు. ఈటీవీ సీరియల్
శ్రీభాగవతం లో రామాయణ గాధను అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీరామ
భక్తుడైన త్యాగయ్య బాపు దర్శకత్వంలోవచ్చింది. స్వయంగా మంచి
చిత్రకారుడైనందువల్ల శ్రీ బాపు తీసిన శ్రీరామగాధలు కన్నులపండుగగా
వుంటాయి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారన్నట్లు శ్రీ బాపు బొమ్మ
గీ(తీ)సేటప్పుడు ఋషిగా మారిపోతారన్నది నిజం!
శీరామనవమి మంచి వేసవికాలంలో వస్తుంది. అందుచేతనేనేమో మన
పెద్దలు భక్తులకు చల్లగా చలువ పందిళ్ళు వేసి (ఇప్పటిలా షామియానాలు
కాకుండా), చలువచేసే వడపప్పూ, పానకం ప్రసాదంగా అందించే సాంప్రదాయం
ఏర్పాటుచేశారు.శ్రీరామచంద్రుని రామభద్రుడనికూడా పిలుస్తారు.
రామాయ రామభద్రాయ
రామచంద్రాయ వేధసే
రఘునాధాయ నాధాయ సీతాయా:
పతయే నమ:11
ఎవరికి ఎలాటి ఆపద కలిగినా తనపై నమ్మకంతో వేడుకొనే భక్తునికి దాసుణ్ణి
అన్నాడు శ్రీరాముడు.రామదాసు శ్రీరామునికి దాసుడవడమేకాదు.ఆ శ్రీరాముడే
రామదాసుకు దాసుడైనాడు!! శ్రీరాముడు తన ఎదుటబడినవారిని నగుమోముతో
తానే పలుకరించేవాడట. సకలగుణాభి రాముడు అందరికీ ఈ శ్రీరామనవమినాడు
శుభాశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను.
జై శ్రీరామ్

No comments:

Post a Comment