Tuesday, April 05, 2011

ఊడల మర్రి కధ !!




ఈ హెడ్డింగ్ చూసి ఇదేదో హర్రర్ కధనుకోకండి! అన్ని వయసుల వారు చదవొచ్చు!!
రహదారులను వెడల్పు చేయడం మొదలు పెట్టాక రోడ్డుకు ఇరువైపులా బారులు
తీరిన మర్రి చెట్లు మనకు కనుమరుగయి పొయాయి. పూర్వం రహదారులపై
ప్రయాణం చేస్తుంటే ఈ చెట్లు చల్లని నీడనిస్తూ వుండేవి. ఆ చెట్ల నీడనే ఎడ్ల బండ్లను
ఆపు చేసి ప్రయాణికులు , ఎడ్లు సేదతీరేవి. గ్రామీణ ప్రాంతాలలో మర్రి చెట్లను దేవతలుగా
భావిస్తారు. ఈ చెట్టు వందలాది ఏండ్లు జీవిస్తుంది. ఈ చెట్లక్రిందే పూర్వం మునులు
తపస్సు చేసేవారు. మర్రిచెట్ల వూడలనే ఉయ్యాలలుగామార్చిఅమ్మాయిలు ఉయ్యాల
లూగుతుండేవారు. మన చిన్నతనంలో పాఠ్యపుస్తకాలలో చదివిన కధ మీకు గుర్తుండే
వుంటుంది. పక్క వూరికి ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని
ఓ మర్రి చెట్టు నీడన పడుకుంటాడు. ఆ చెట్టుకు ఎదురుగా ఓ గుమ్మడి పాదు, దానికి
పెద్ద పెద్ద గుమ్మడి కాయలు విరగ కాసి అగుపిస్తాయి. అప్పుడు అతను, " దేముడు ఎంతటి
తెలివి తక్కువగా సృష్టించాడు. సన్నని బలహీనమైన తీగకు బరువైన పెద్ద కాయలుంచాడు.
ఈ మహావృక్షానికి చిన్నచిన్న కాయలుంచాడు " అనుకుంటూ కునుకు తీశాడు. కాసేపటికి
మెలకువ వచ్చి చూచేటప్పటికి అతని ఒంటిపై వేలాది మర్రి కాయలు రాలిపడివుంటాయి.
"నేను తొందరపడి భగవంతుణ్ణి నిందించాను. ఆ గుమ్మడి కాయలే ఈ చెట్టుకే వుండి వుంటే
ఈ సరికి నా ప్రాణాలు ఆ దేముడి దగ్గరకే చేరి వుండేవి" అని అనుకున్నాడట !మర్రిచెట్టుకు
చుట్టూ విస్తరించిన ఊడలు అంతటి మహావృక్షాన్ని గాలి వానలకు తట్టుకొని నిలబడేటట్లు చేస్తాయి.
ఈ చెట్టు శాస్త్రీయనామం పైకస్ బెగ్లెన్సిస్.
మర్రిచెట్టు కలపను చెక్కరోళ్ళుగా చెక్కేవారు.గ్రామాల్లో ఇప్పటికీ ఈ రకం చెక్క రోళ్ళు
అగుపిస్తుంటాయి.. ఔషధంగా లేతమర్రి ఊడలు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. స్టేట్ బ్యాంకు
చిహ్నంగా కొంతకాలంవరకు మర్రిచెట్టు వుండేది. శాఖోపశాఖలుగా మర్రిచెట్టులా బ్యాంకు
విస్తరిస్తుందనీ , అన్ని వర్గాల వారికి మర్రిచెట్టులా సేవలందిస్తుందనీ ఆ గుర్తు తెలియజేస్తుంది.
కాలక్రమేనా ఆ గుర్తుకు బదులు ఇప్పటి కీ హొల్ గుర్తును ఏర్పరిచారు. నాకు మాత్రం ఆ పాత
మర్రిచెట్టు గుర్తే బాగున్నదనిపిస్తుంది. ఆ మర్రి చెట్టు గుర్తును మీకు చూపించాలని ప్రయత్నిస్తే
నా బ్యాంకు ఫైల్సు లోనూ దొరకలేదు. చివరకు నాకు గుర్తున్నంతవరకు ఊహించి బొమ్మ గీశాను.
ఎక్కడైనా పొరబాటు వుంటే ఇది చదివిన బ్యాంకు మితృలు తెలియజేస్తారని తలుస్తాను.

2 comments:

  1. సురేఖ గారూ ఎస్ బి ఐ పాత లోగా బహు బాగా వేశారు. ఎస్ బి ఐ మీద ఒక స్టాంప్ విడుదలైంది అందులో వారి పాత లోగో కూడ ఉన్నది. ఆ స్టాంపు బొమ్మ మీకు మైలు ద్వారా పంపుతున్నాను వీలైతె పైన మీరు అందించిన బొమ్మలతో పాటుగా ఉంచండి.

    ReplyDelete
  2. మీ కథకు... మీ బొమ్మకు నమోన్నమహ... ధన్యవాదములు... చిన్న బొమ్మ- పెద్ద రాత ద్వారా గొప్ప సత్యములే తెలిపితిరి.

    ReplyDelete